Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : ప్రతీ 11 నిమిషాలకు ఓ మహిళ లేదా బాలిక... భాగస్వామి, లేదా కుటుంబసభ్యుల చేతుల్లోనే హత్యకు గురవుతున్నదని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై తీవ్రమైన హింస అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు జాతీయస్థాయిలో ప్రణాళికను అమలుచేయాలని పిలుపునిచ్చింది. ఈ నెల 25న అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్ హత్య నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది థీమ్‌గా మహిళలు, బాలికలపై హింసను అంతం చేయడానికి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారితో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, ఇతర ఒత్తిళ్లు శారీరక, మౌఖిక దుర్వినియోగానికి దారితీస్తున్నాయని అన్నారు. లైంగిక వేధింపులు, విద్వేష ప్రసంగాలు, వస్త్రధారణ, ఫొటోలతో ఆన్‌లైన్‌లోనూ మహిళలు, బాలికలు హింసను ఎదుర్కొంటున్నారని అన్నారు. మానవజనాభాలో సగభాగంగా ఉన్న మహిళలు లక్ష్యంగా వివక్ష, హింస, దుర్వినియోగం అత్యధికంగా ఉందని.. ఇది వారి సాధారణ హక్కులైన స్వేచ్ఛ, ఆర్థిక సమానత్వం, అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని అన్నారు. మహిళలు, బాలికలకు వ్యతిరేకంగా హింస చరిత్ర పుస్తకాల్లో ఉండాలనీ, ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవడానికి ఇది సరైన సమయమని గుటెరస్ పేర్కొన్నారు.
ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు జాతీయ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం, నిధులు సమకూర్చడం, అమలు చేయడం, ప్రతిదశలోనూ అట్టడుగు వర్గాలు, ప్రజలు పాల్గొనేలా చట్టాలు అమలు చేయాలని అన్నారు. 2026 నాటికి మహిళా హక్కుల సంఘాలు, ఉద్యమాలకు 50శాతం నిధులను పెంచేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మహిళలకు మద్దతుగా, వారికి సహకారం అందించేలా మనం నిలబడాలని, మనమంతా స్త్రీవాదులమని గర్వంగా చెప్పాలని అన్నారు.