Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాల్పులు జరిపింది వాల్‌మార్ట్ ఉద్యోగే
చెసాపీక్ (వర్జీనియా) : వర్జీనియా రాష్ట్రంలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో మంగళవారం రాత్రి కాల్పులు జరిగాయి. గురువారం థేంక్స్గివింగ్ హాలిడే షాపింగ్ కోసం వచ్చిన వారితో స్టోర్ అంతా రద్దీగా వున్న సమయంలో వాల్‌మార్ట్ ఉద్యోగే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆరుగురిని హతమార్చిన తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల కాలంలో ఇది రెండో సంఘటన. కాగా మరో నలుగురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రిలో చేర్చినట్టు చెసాపీక్ పోలీసు చీఫ్ మార్క్ సోలెస్కీతెలిపారు. ఈ కాల్పుల వెనక గల కారణమేంటన్నది వెంటనే తెలియరాలేదని పత్రికా సమావేశంలో ఆయన చెప్పారు. గత వారాంతంలో కొలరాడోలోని ఎల్జీబీటీక్యు క్లబ్లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. వర్జీనియా రాష్ట్రంలో ఈనెల్లో ఇది రెండో సంఘటన. ఈనెల 13న వర్జీనియా వర్శిటీ విద్యార్ధులు ముగ్గురిపై వారి సహ విద్యార్ధే కాల్పులు జరిపి హతమార్చాడు.
శామ్ సర్కిల్లోని వాల్‌మార్ట్‌లో కాల్పుల గురించి రాత్రి 10.12 గంటల సమయంలో పోలీసులకు ఫోన్ వచ్చిందని, వెంటనే రెండు నిముషాల వ్యవధిలో పోలీసులు అక్కడకు వెళ్ళారని చెప్పారు. కాగా, పోలీసులపై ఎలాంటి కాల్పులు జరగలేదని చెప్పారు. కాగా ఈ సంఘటన పట్ల తాము తీవ్రంగా దిగ్భ్రాంతి చెందామని వాల్‌మార్ట్ యాజమాన్యం తెలిపింది. ఈ విషాద సమయంలో తమ సిబ్బందికి తోడ్పాటుగా నిలుస్తామని ప్రకటించింది. సమాచారం తెలియగానే స్టోర్ వద్దకు చేరుకున్న పోలీసులు మొత్తంగా ఆ చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టారు.