Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా ప్రభుత్వానికి ఐదు వార్తాపత్రికల లేఖ
లండన్ : వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ను ప్రాసిక్యూట్ చేయాలన్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని పశ్చిమ దేశాలకు చెందిన ఐదు ప్రముఖ వార్తాపత్రికలు సోమవారం అమెరికాకు సంయుక్తంగా విజ్ఞప్తి చేశాయి. ప్రస్తుతం అసాంజ్ బ్రిటన్లో కస్టడీలో వున్నారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ల్లో యుద్ధాలకు సంబంధించి అమెరికా మిలటరీ రహస్యాలను వెల్లడించినందుకు అసాంజె విచారణను ఎదుర్కొనాల్సి వుందని, అందుకే తమకు అప్పగించాలని అమెరికా కోరుతోంది. ఆ అభ్యర్ధన ప్రస్తుతం పెండింగ్లో వుంది. ''ప్రచురణ అనేది నేరం కాదు.' అని ది గార్డియన్, లే మోండె, ది న్యూయార్క్ టైమ్స్, ఎల్ పయస్, డెర్ స్పీగల్ వార్తా పత్రికల సంపాదకులు, ప్రచురణకర్తలు వాదించారు. ఈ మేరకు వారు అమెరికా ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. వికీలీక్స్ సంపాదించిన రెండున్నర లక్షల కేబుల్స్లోని ముఖ్యాంశాలను విడుదల చేసి 12 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా వారీ లేఖ రాశారు. రహస్య పత్రాలను సంపాదించి, ప్రచురించినందుకు అసాంజెను ప్రాసిక్యూట్ చేయడం కోసం ఇన్నేళ్ళుగా జరుగుతున్న ప్రయత్నాల పట్ల తాము తీవ్ర ఆందోళన చేస్తున్నట్లు ఆ లేఖ పేర్కొంది. అసాంజెను అభిశంసించడమనేది చాలా ప్రమాదకరమైన సాంప్రదాయాన్ని సృష్టిస్తుంది. పైగా అమెరికా రాజ్యాంగ మొదటి సవరణను దెబ్బతీస్తుంది, పత్రికా స్వేచ్ఛకు ముప్పుగా మారుతుందని ఆ లేఖ పేర్కొంది.