Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యరాజ్య సమితి భారత్ రాయబారి రుచిర కాంభోజ్
న్యూయార్క్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరు పక్షాల వైపు భారత్ మాట్లాడుతోందని ఐక్యరాజ్య సమితిలో భారత్ శాశ్వత రాయబారి రుచిర కాంభోజ్ చెప్పారు. యుద్ధంపై భారత్ వైఖరి నిష్క్రియాపరంగా వుండదని స్పష్టం చేశారు. డిసెంబరు మాసానికి ఐక్యరాజ్య సమితి అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది. భారత్ శాంతిపక్షం వైపు వుందని, దౌత్యం, చర్చల ద్వారా ఉద్రిక్తతల తగ్గింపునకే తాము అనుకూలంగా వున్నామని రుచిర చెప్పారు. ఈ నెల రోజుల కాలంలో తీవ్రవాదాన్ని ఎదుర్కొనడంపై, బహుళపక్షవాదంపై పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. రష్యాతో భారత్ కీలకమైన సంబంధాలను కలిగి వుందని ఆమె స్పష్టం చేశారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి తాము చాలా స్పష్టమైన వైఖరితో వున్నామని, శాంతి కోసమే నిలబడ్డామని చెపాపరు. దౌత్యం, చర్చల ద్వారా శాంతి స్థాపన అన్నదే తమ పక్షమని చెప్పారు. రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ను లాగేందుకు నాటో ప్రయత్నిస్తోందంటూ రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌లు ఇరు పక్షాల వైపు వారితో మాట్లాడుతున్నారని చెప్పారు. రెండువైపుల వారితో మాట్లాడుతున్న అతి కొద్ది దేశాల్లో భారత్ వుందన్నారు. ఇది యుద్ధ శకం కాదన్న మోడీ వ్యాఖ్యలను ఆమె ఉటంకించారు.