Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రక్కర్లకు మద్దతుగా దక్షిణ కొరియాలో వేలాదిమంది నిరసన
సియోల్ : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస సరుకు రవాణా ధరలను ప్రకటించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని వారం రోజులుగా విధులు బహిష్కరించి వేలాదిమంది ట్రక్కు డ్రైవర్లు చేస్తున్న సమ్మె ఉధృతమైంది. తిరిగి పనుల్లోకి రావాల్సిందిగా వారిపై ప్రభుత్వం నిర్బంధ కాండకు దిగుతోంది. ప్రభుత్వ ప్రయత్నాలను నిరసిస్తూ శనివారం రాజధాని సియోల్లో సంఘటిత రంగాలకు చెందిన వేలాదిమంది కార్మికులు, ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొరియా వాణిజ్య సంఘాల సమాఖ్య సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ నేతృత్వంలోని ప్రభుత్వం కార్మికుల అణచివేత చర్యలకు పాల్పడుతోందని వారు విమర్శించారు. ట్రక్కర్లు ఎదుర్కొంటున్న కఠిన పని పరిస్థితులను, వారి ఆర్థిక పోరాటాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెరుగుతున్న ఇంధన ధరలతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. వెంటనే విధులకు హాజరు కావాలంటూ దాదాపు 2,500మంది ట్రక్కు డ్రైవర్లకు ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. సమ్మె కొనసాగించాలని యూనియన్లు నిర్ణయించాయి. కార్గో ట్రక్కర్ల సంఘీభావ సంఘానికి చెందిన వేలాదిమంది సభ్యులు గత వారం నుండి సమ్మె చేస్తున్నారు. కనీస సరుకు రవాణా రేటు వ్యవస్థను శాశ్వతంగా రూపొందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సిమెంట్, షిప్పింగ్ కంటెయినర్లకు మాత్రమే ప్రస్తుతం కనీస ధరలు అమలవుతున్నాయి. ఇతర సరుకులకు కూడా ఈ ప్రయోజనాలు వర్తింపజేయాలని ట్రక్కర్లు డిమాండ్ చేస్తున్నారు.