Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : బ్రిటన్‌లో సుమారు 40 వేల మంది రైల్వే కార్మికులు సమ్మె బాట పట్టారు. వేతనాల పెంపు డిమాండ్‌తో నాలుగు రోజుల సమ్మెకు పిలుపునిచ్చినట్లు రైల్, మారిటైమ్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ ( ఆర్‌ఎంటి - కార్మిక సంఘం ) ప్రకటించింది. మంగళవారం నుండి శనివారం వరకు కొనసాగనున్న సమ్మెతో దేశవ్యాప్తంగా రవాణా స్తంభించిపోనుందని పేర్కొంది. కార్మికుల వేతనాలలో ఏడు శాతం పెంపుదల చేయాలన్న డిమాండ్‌పై రైల్వే కంపెనీ ' నెట్ వర్క్ రైల్' తో కార్మికులు జరిపిన చర్చలు విఫలమయ్యాయని ఆర్‌ఎంటి ప్రధాన కార్యదర్శి మిక్ లించ్ తెలిపారు. దేశంలో ఇప్పటికే ద్రవ్యోల్బణం 11 శాతానికి చేరిందని, దీంతో ధరలు కొండెక్కుతున్నాయని అన్నారు. బ్రిటన్‌లోని రిషిసునాక్ (కన్జర్వేటివ్) ప్రభుత్వం ప్రతిపాదించిన వేతన పెంపు ఆమోదయోగ్యం కాదని, ఇది ద్రవ్యోల్బణం కంటే చాలా తక్కువగా ఉందని అన్నారు. కార్మికులకు, కంపెనీకి మధ్య జరిగిన ఒప్పందాన్ని రిషిసునాక్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని అన్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు, ప్రస్తుత సమస్యల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం సమ్మె కొనసాగాలని కోరుకుంటోందని అన్నారు. కన్జర్వేటివ్ ప్రభుత్వ విధానాలపై సామాజిక అసంతృప్తి వెల్లువెత్తడంతో గతేడాది సమ్మెలు పెరిగాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. క్రిస్మస్ నుండి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేపట్టనున్నారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు, పింఛన్లు పెంచాలన్న ప్రధాన డిమాండ్‌తో జరుగుతున్న ఈ సమ్మెలో బస్సు, రైల్వే, విమానం, అంబులెన్స్, నర్సింగ్, పోస్టల్, టీచింగ్ సిబ్బంది సహా వివిధ విభాగాలకు చెందిన రెండు లక్షలకు పైగా ఉద్యోగులు పాల్గొననున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫలితంగా బ్రిటన్‌లో అన్ని రకాల సేవలు నిలిచిపోనున్నాయి. గత 30 ఏళ్లలో ఇదే అతిపెద్ద సమ్మెగా భావిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు ఈ సమ్మె ఒక ఛాలేంజ్‌గా నిలిచిందని రాజకీయ, ఆర్థిక పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతి శాఖ ఉద్యోగులకు వేర్వేరు డిమాండ్లు ఉండగా.. అందరి ఉమ్మడి డిమాండ్ మాత్రం జీతాలు పెంచడం. ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో పెరుగుతుందో.. తమ జీతాలు అదే వేగంతో పెరగడం లేదని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.