Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెయింట్ జార్జెస్ : క్యూబాపై అమెరికా దిగ్భంధనానికి ముగింపు పలకాలని బుధవారం గ్రెనడా ప్రధాని డికాన్ మిచెల్ పిలుపునిచ్చారు. క్యూబా విప్లవాత్మక మార్పుని అణచివేయాలనే ఉద్దేశంతో క్యూబాపై అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్య, ద్రవ్య నిర్బంధాన్ని ఎత్తివేయాలని పేర్కొన్నారు. బలీవియన్ అలయన్స్ ఫర్ ది పీపుల్స్ ఆఫ్ అవర్ అమెరికా పీపుల్స్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఏఎల్బీఏ-టీసీపీ) వార్షికోత్సవం సందర్భంగా క్యూబా పార్లమెంట్లో ప్రధాని ప్రసంగించారు. అమెరికా దిగ్బంధనాన్ని తిప్పికొట్టేందుకు సమిష్టిగా యత్నించాలని అన్నారు. అమెరికా ఏకపక్షంగా ఉగ్రవాదదేశాల జాబితాలో క్యూబాను చేర్చడాన్ని ఖండించారు. అలాగే వెనిజులాపై ఆంక్షలు విధించడాన్ని తిరస్కరించారు. క్యూబా, వెనిజులాలు తమ దేశానికి అందిస్తున్న సంఘీభావానికి, ముఖ్యంగా కరోనా మహమ్మారి వ్యతిరేక పోరాటానికి అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ మార్పుల ప్రమాదాలపై కరేబియన్ దేశాలను హెచ్చరించారు. తుఫానులు, కొన్నిగంటల వ్యవధిలో కొన్నేళ్ల అభివృద్ధిని నాశనం చేయగలవని పేర్కొన్నారు. పర్యావరణ మార్పులకు అభివృద్ధి చెందుతున్న దేశాలను జవాబుదారీగా ఉంచడానికి, కరేబియన్ దేశాలకు నష్టాలను భర్తీ చేయడానికి సహకారం అందించాల్సిందిగా సూచించిన ఎఎల్బిఎ-టిసిపికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది కరేబియన్ దేశాలకే కాకుండా ఇతరులపై కూడా ప్రభావం చూపుతుందని, ఇటీవల క్యూబా, నికరగువాలో తుఫానులు, వెనిజులా, బలీవియాలో వరదలు నిదర్శనమని అన్నారు. ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశాలు ప్రాంతీయ ఐక్యత, స్వీయ నిర్ణయాధికారం, సార్వభౌమాధికారం సాధించాలని కోరారు.