Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాలో జెలెన్స్కీ పర్యటన, బైడెన్‌తో భేటీ
వాషింగ్టన్ : రష్యాతో జరిగే యుద్ధంలో తమకు సాయం చేస్తున్నందుకు అమెరికన్ నేతలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేసేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బుధవారం అమెరికాలో పర్యటించారు. యుద్ధాన్ని ముగించడానికి చేసే ప్రయత్నాల్లో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు సాయంగా ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు బైడెన్, అమెరికన్ కాంగ్రెస్‌లు కోట్లాది డాలర్లను అందచేశాయి. ఓవల్ కార్యాలయంలో జెలెన్స్కీకి బైడెన్ స్వాగతం పలికారు. గతంలోనే తాను అమెరికా రావాలనుకున్నానని, అయితే అమెరికా అందచేసిన సాయం, మద్దతు వల్ల ఇప్పుడు పరిస్థితి అదుపులో వుందని, అందుకే తాను రాగలిగానని జెలెన్స్కీ చెప్పారు. శాంతి కోసం యుద్ధాన్ని ముగించడమనేది లేదని, ఒక దేశాధ్యక్షుడిగా ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, స్వేచ్ఛ, ప్రాదేశిక సమగ్రతలు పునరుద్ధరించబడితేనే యుద్ధం ముగుస్తుందని వ్యాఖ్యానించారు. అలాగే రష్యా సైనిక చర్య వల్ల జరిగిన నష్టాన్ని కూడా తిరిగి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ యుద్ధ వ్యయాలు పెరిగిపోవడం పట్ల, పర్యవసానంగా ఆహార, ఇంధన సరఫరాలు దెబ్బతినడం పట్ల అమెరికా మిత్రపక్షాలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారి మద్దతును, సాయాన్ని పునరుద్ధరించుకోవడం కోసం జెలెన్స్కీ పర్యటన ఉద్దేశించబడింది.