Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్
- మధ్య అమెరికా అంతటా మంచు దుప్పటి.. మైనస్ 40 డిగ్రీల సెల్సీయస్
- క్రిస్మస్వేళ వేలాది విమానాలు రద్దు
వాషింగ్టన్ : ఆర్కిటిక్ మీదుగా వస్తున్న చలిగాలులతో అమెరికా గజ గజ వణికిపోతోంది. ఇంట్లో నుంచి బయటకు వస్తే గడ్డకట్టుకు పోయి..ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వాతావరణ శాస్త్రవేత్తలు అక్కడి పౌరులకు హెచ్చరికలు జారీచేశారు. భారీగా కురుస్తోన్న మంచు, తీవ్రమైన చలిగాలులకు..స్థానిక ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు పడిపోయాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మంచు దుప్పటి కప్పేసింది. శనివారమూ ఇదే విధమైన వాతావరణం నెలకొంటుందని స్థానిక ప్రభుత్వ అధికారులు ప్రకటనలు జారీచేశారు. దీంతో క్రిస్మస్ సమీపిస్తోన్నవేళ పండుగ ప్రయాణాలకు ఈ వాతావరణం అవరోధంగా మారింది. వాతావరణం అత్యంత ప్రమాదకరంగా మారిందని, ప్రజలెవరూ బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. మంచు తుఫాన్, తీవ్రమైన చలిగాలులు ఉంటాయని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. తాజా సమాచారం ప్రకారం ఆర్కిటిక్ చలిగాలులు మధ్య అమెరికా అంతటా విస్తరించాయని తెలిసింది. దేశ జనాభాల్లో 60శాతం (దాదాపు 20 కోట్లు) మందిపై మంచు తుఫాన్ ప్రభావం పడింది. ఉష్ణోగ్రతలు పడిపోవటంతో ఈ వాతావరణంలో గడపటం ప్రాణాలకు ముప్పు అని, శీతల గాలుల వల్ల ఉష్ణోగ్రతలు మైనస్ 50కి పడిపోతాయని నేషనల్ ఒసియానిక్, అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
జాగ్రత్తలు లేకుండా రావొద్దు..
శుక్రవారం 2200 విమానాలు రద్దయినట్టు సమాచారం. మంచు పేరుకుపోవడంతోపాటు దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాన రహదారులనూ మూసివేశారు. మధ్య అమెరికాలో పౌరులకు తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా మిన్నియాపొలిస్, సెయింట్ పాల్, న్యూయార్క్, షికాగో తదితర ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. మెంటాన, మిన్నెసోటాల్లో..బయటి వాతావరణం చాలా చల్లగా ఉందని, జాగ్రత్తలు లేకుండా బయటకు వెళ్తే నిమిషాల్లో గడ్డకట్టుకుపోయే ప్రమాదముందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితులు 'బాంబు సైక్లోన్'గా బలపడే ప్రమాదం ఉందని అక్యూవెదర్ సంస్థ తెలిపింది. దట్టమైన పొగ మంచుతోపాటు వాహనాలు అదుపుతప్పే ప్రమాదమున్నందున, ప్రస్తుతానికి రోడ్డు మార్గంలో ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అమెరికాలోని ప్రధాన రహదారి ఇంటర్‌స్టేట్-90ని సౌత్ డకోటాలో మూసివేశారు. ఇలా అనేక ఫ్రీవేలను ప్రస్తుతం ప్రయాణించేందుకు అసాధ్యమైన రోడ్లుగా ప్రకటించారు. మరోవైపు..విమానాలను ట్రాక్ చేసే వెబ్సైట్ ఫ్లైట్ అవర్ ప్రకారం అమెరికాలో గురువారం దాదాపు 22వేలకు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి.