Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 22మంది మృతి
- ఎలాంటి అనుమతులు, వసతులు లేకుండానే ఆశ్రయం ?
మాస్కో : సైబీరియా నగరమైన కెమెరొవోలో ఒక ఇంట్లో శనివారం తెల్లవారు జామున మంటలు చెలరేగడంతో 22మంది మరణించారు. స్థానిక పాస్టర్కి చెందిన ఈ ఇల్లును నిరాశ్రయులైన వృద్ధుల కోసం ఆశ్రయంగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇందుకోసం సరైన రీతిలో చర్యలు తీసుకోలేదని అర్థమవుతోంది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను అదుపు చేయడానికి డజన్ల సంఖ్యలో అగ్నిమాపక యంత్రాలు, అత్యవసర బృందాలు కృషి చేశాయి. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారు జామున 3.30గంటలకు మంటలు చెలరేగాయి. వెంటనే 28 వాహనాలు, 80 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలికి చేరుకున్నాయి. తొలుత 11మందే మరణించారని భావించారు. ఆ తర్వాత ఆ సంఖ్య 22కి పెరిగిందని రష్యా దర్యాప్తు కమిటీ తెలిపింది. అధికారికంగా నమోదు కాని ఈ వృద్ధాశ్రమంలో వున్న వృద్ధులే మరణించినట్లు కనిపిస్తోందని అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. విద్యుత్ వ్యవస్థలో లోపం వల్లనే మంటలు చెలరేగాయని అధికారులు అనుమానిస్తున్నారు. లోపల చాలా హీటర్లు వున్నందున బహుశా అందుకు సరిపడా వైరింగ్ వుండకపోవచ్చని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఈ నర్సింగ్ హోంలో మంటలను అదుపు చేసే ఎలాంటి వ్యవస్థలు లేవు. ఈ అగ్ని ప్రమాదంపై క్రిమినల్ దర్యాప్తు చేపట్టినట్లు రష్యా దర్యాప్తు కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ హోంకి ఇన్చార్జిగా భావిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.