Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాట్మండు : నేపాల్ కొత్త ప్రధానిగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ - మావోయిస్టు సెంటర్ ఛైర్మన్ పుష్ప కమాల్ దహల్ అలియాస్ ప్రచండ బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రచండ నేపాల్ రాష్ట్రపతి బిద్యాదేవి బండారిని ఆదివారం సాయంత్రం కలిసి, మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని తెలుపుతూ లేఖ అందజేశారు. రొటేషన్ పద్దతిలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రచండ, మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి మధ్య అవగాహన కుదిరింది. 165 మంది సభ్యుల బలమున్న మొత్తం ఏడు ప్రతిపక్ష పార్టీలు ప్రచండ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నట్లు ఆదివారం ప్రకటించాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 275 స్థానాలకు గాను 89 స్థానాలను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా ఏర్పడిన నేపాలి కాంగ్రెస్ గడువులోపున ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. బాలకోట్‌లోని మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి నివాసంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయనతోపాటు ప్రచండ, ఏడు ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు.