Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రిస్మస్ సందేశంలో పోప్ ఫ్రాన్సిస్
వాటికన్ సిటీ : ప్రపంచం శాంతి కోసం అలమటిస్తోందని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా వాటికన్లోని సెయింట్ పీటర్స్ బాసిలికా ప్రధాన బాల్కనీ నుంచి వేలాదిమంది ప్రజలనుద్దేశించి ఆయన ఆదివారం సందేశం ఇచ్చారు. యుద్ధాలు, ఇతర వివాదాలకు ముగింపు పలకాలని అన్నారు. నిరాశ్రయులు, వలసదారులు, శరణార్థులు, పేదలకు సహాయం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 'ప్రపంచంలో ప్రతిచోటా శాంతి కోసం ఎదురుచూస్తున్న పిల్లలందరి ముఖాలను చూద్దాం... ఉక్రెయిన్ సోదరులు, సోదరీమణుల ముఖాలను కూడా చూద్దాం' అని అన్నారు. 'బాధలో ఉన్న వారందరికీ సహాయం చేయడానికి, సంఘీభావం అందించడానికి ప్రభువు మనల్ని ప్రేరేపించుగాక, ఆయుధాల శబ్ధాలతో నిండిపోయిన వారి మనసులను ప్రకాశవంతం చేసి, ఈ తెలివిలేని యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలి' అని పేర్కొన్నారు. ఇజ్రాయిల్, పాలస్తీనీయన్ల మధ్య శాంతి చర్చలను పున:ప్రారంభించాలని పిలుపునిచ్చారు. 2013 మార్చి 13న పోప్‌గా బాధ్యతలు స్వీకరించిన ఫ్రాన్సిస్‌కు ఇది 10వ క్రిస్మస్ సందేశం.