Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 55 మంది మృతి
వాషింగ్టన్ : భారీ శీతల తుపాను అమెరికాను వణికిస్తోంది. గత ఆరు రోజులుగా ఈ తుపాను అగ్రరాజ్యంపై విరుచుకుపడుతున్నది. జనాభాలో 60శాతం లేదా 200 మిలియన్ల కంటే ఎక్కువ మంది తుపానుకు ప్రభావితమయ్యారని అధికారులు తెలిపారు. అంటే మొత్తం జనాభాలో మూడింట రెండొంతుల మంది మంచుతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక్క న్యూయార్క్లో సగానికిపైగా మరణాలు నమోదైనట్టు స్థానిక మీడియా పేర్కొంది. సోమవారం ఉదయం నాటికి పశ్చిమ న్యూయార్క్లో 27 మంది మరణించగా, దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 55కు చేరినట్టు తెలుస్తున్నది. న్యూయార్క్లో 50 సెంటీ మీటర్లకు పైగా మంచు కురిసిందనీ, ఉష్ణోగ్రతలు మైనస్ 22 డిగ్రీలకు చేరుకున్నాయని న్యూయార్క్ గవర్నర్ కాథీ హౌచుల్ పేర్కొన్నారు. పశ్చిమ న్యూయార్క్లో కనిష్ట ఉష్ణోగ్రతలు, మంచు తుపాను, గడ్డకట్టే వర్షంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిందనీ, దీంతో 15 వేల మంది విద్యుత్ కోతను ఎదుర్కొంటున్నారని అన్నారు. మంగళవారం నాటికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పారు. పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని హౌచుల్ హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు సిబ్బందిని మోహరించామని అన్నారు. న్యూయార్క్ చరిత్రలోనే ఇది అతిపెద్ద సమీకరణగా పేర్కొన్నారు.
బఫెలో ప్రాంతం కూడా తీవ్రంగా ప్రభావితమైందని అన్నారు. పలు ప్రాంతాల్లో 8 నుంచి 12 అడుగులకు పైగా మంచు కురిసే అవకాశం ఉందనీ, ఎరీ కౌంటీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్టు ఎరీ కౌంటీ ఎగ్జిక్యూటివ్ మార్క్ తెలిపారు. చాలా నగరాల్లో -40 డిగ్రీల కంటే తీవ్రమైన చలి నమోదవుతున్నది. నప్లెస్లో -52, మియామీలో -50 డిగ్రీల చలి రికార్డయింది. బఫెలో ప్రాంతంలో నిరంతరాయంగా 37.25 గంటల పాటు మంచు తుపాను పరిస్థితులు నెలకొన్నాయి. గత శుక్రవారం ఉదయం గంటకు 71 మైళ్ల వేగంతో చలిగాలులు వీచాయని నేషనల్ వెదర్ సర్వీసెస్ ప్రకటించింది. జెఫర్సన్, ఉత్తర లూయిస్ కౌంటీలలో 60సెం.మీలకు పైగా మంచు కురుస్తోందని తెలిపింది.