Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రెజిల్ అధ్యక్షుడిగా ప్రముఖ వామపక్ష నేత లూలా ద సిల్వా
- కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రమాణస్వీకారం
- భారీగా తరలి వచ్చిన ప్రజలు, అభిమానులు
బ్రసిలియా : బ్రెజిల్ దేశ అధ్యక్షుడిగా ప్రముఖ వామపక్ష నాయకుడు లూయిజ్ ఇనాసియో లూలా ద సిల్వా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయన బ్రెజిల్ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఇది మూడో సారి. గతంలో 2003-10 మధ్య ఆయన రెండు సార్లు అధ్యక్షుడిగా ఉన్నారు. రైట్ వింగ్ నాయకుడు అయిన జైర్ బోల్సోనారోను గత అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఓడించిన అనుభవజ్ఞుడైన వామపక్షవాది లులూ ద సిల్వా ఇప్పుడు బ్రెజిల్ అధ్యక్ష పదవిని చేపట్టారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజల మధ్య, అత్యంత పటిష్ట భద్రత నడుమ జరిగిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి కార్యాలయం ప్లానాల్టో ప్యాలెస్‌లో ఆదివారం లూలా ప్రమాణస్వీకారోత్సవానికి భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, నాలుగేండ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు. తమ అభిమాన నాయకుడి ప్రమాణస్వీకారాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
ఆశ.. పునర్నిర్మాణం.. : బ్రెజిల్‌కు సందేశమిచ్చిన లూలా
ఇది తన విజయం కాదనీ, ప్రజాస్వామ్య విజయం అని లూలా తన ప్రారంభోపాన్యాసంలో వెల్లడించారు. '' ఓటు వేసే స్వేచ్చకు అత్యంత హింసాత్మకమైన బెదిరిపులను, ఓటర్లను ఇబ్బంది పెట్టడానికి పన్నిన అసత్యాలు, ద్వేషాల అత్యంత దారుణమైన ప్రచారాన్ని ప్రజాస్వామ్యం అధిగమించింది'' అని ఆయన అన్నారు.బోల్సోనారో పేరు ఎత్తకుండా ఆయనను లూలా హెచ్చరించారు. ''దేశాన్ని వారి వ్యక్తిగత, సైద్ధాంతిక రూపకల్పనలకు లొగదీసుకోవడానికి ప్రయత్నించినవారిపై మేము ఎలాంటి ప్రతీకార స్ఫూర్తిని కలిగి ఉండము. మేము చట్టబద్దమైన పాలనకు హామీ ఇస్తాం'' అని తెలిపారు. ''ఆశ మరియు పునర్నిర్మాణం'' బ్రెజిల్‌కు తన సందేశమని కొత్త అధ్యక్షుడు చెప్పారు.గత కొన్నేండ్లుగా కోల్పోయిన హక్కులు, స్వేచ్ఛ, అభివృద్ధిని మళ్లీ దక్కేలా కృషి చేస్తామన్నారు. దేశంలో పేదల జీవితాలను మెరుగుపర్చేందుకు జాతి, లింగ సమానత్వం కోసం కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు.
ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని బోల్సోనారో చివరకు దేశాన్ని విడిచిపెట్టిపోయిన రెండు రోజుల తర్వాత లులా ద సిల్వా ఆ దేశ అధ్యక్ష పీఠాన్ని ఎక్కారు. గతేడాది బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు జరగగా అందులో లులాకు 50.3 శాతం ఓట్ షేర్ లభించింది. అయితే, బోల్సోనారో మాత్రం తన ఓటమిని అంగీకరించలేదు. ఆ దేశ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ మీద అనుమానాలు లేవనెత్తారు. ఆయన ఆరోపణలతో లులా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి అవరోధాలు ఏర్పడ్డాయి. బోల్సోనారో మద్దతుదారులైతే సైనిక తిరుగుబాటుకు పిలుపునిచ్చారు. దేశంలో సైనిక జోక్యాన్ని ప్రేరేపించేందుకు కూడా బోల్సోనారో మద్దతుదారులు కుట్రలు కూడా పన్నారు. అయితే, అవేవీ లూలా ను అడ్డుకోలేకపోయాయి.
అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బోల్సోనారో జాతీయవాదాన్ని ముందుకు తెచ్చారు. లింగ వ్యతిరేక, ఎల్జీబీటీక్యూ వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహించారు. ఈయన పదవీ కాలంలో అమెజాన్ రెయిన్ఫారెస్టులో అటవీ నిర్మూలన పెరిగింది. స్థానిక భూములు, వ్యక్తులపై హింసాత్మక దాడులు ఎక్కువయ్యాయి. బోల్సోనారో ప్రస్తుతం యూఎస్ఏ లోని ఫ్లోరిడాలో ఉన్నారు.