Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య ఆరోగ్యంపై బ్రెజిల్ అధ్యక్షుడి ప్రత్యేక శ్రద్ధ
బ్రసీలియా : బ్రెజిల్లో మాజీ అధ్యక్షుడు బొల్సనారో హయాంలో తీవ్రంగా దెబ్బతిన్న వైద్య ఆరోగ్య రంగాన్ని మెరుగుపరిచేందుకు ఇటీవల అధికారంలోకి వచ్చిన లూలా డసిల్వా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. 'మోర్ డాక్టర్స్' కార్యక్రమాన్ని పున: ప్రారంభించనున్నట్లు బ్రెజిల్ ప్రభుత్వం పేర్కొంది. దేశంలోని అన్ని మునిసిపాలిటీలలోనూ తక్షణమే వైద్యులను నియమించాలనుకుంటున్నామని ఆరోగ్య శాఖకు చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కార్యదర్శి నెసియో ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ అధ్యక్షుడు బోల్సోనారో హయాంలో రద్దు చేయబడిన మోర్ డాక్టర్స్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు నెసియో స్థానిక మీడియాకు తెలిపారు. బ్రెజిలియన్లకు తొలుత ప్రాధాన్యతనిస్తామని, ప్రాంతీయ కౌన్సిల్లో రిజిస్టర్ చేయబడిన, విదేశాల్లో శిక్షణ తీసుకున్న బ్రెజీలియన్లతో ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు. ఆ తర్వాత ఇతర స్థానాల్లో విదేశీయులను నియమిస్తామని ప్రకటించారు.
బ్రెజిల్ అధ్యక్షురాలిగా దిల్మా రౌసెఫ్ పరిపాలనా సమయంలో 2013లో మోర్ డాక్టర్స్ కార్యక్రమం ప్రారంభమైంది. దేశంలోని పలు నగరాల్లోని ప్రజలకు సంరక్షణ అందించడానికి, నిపుణుల సంఖ్యను పెంచడానికి ఈ మోర్ డాక్టర్స్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. క్యూబా సహా 12కు పైగా దేశాల నుండి వైద్యులు బ్రెజిల్‌కు వచ్చారు. 2019లో మోర్ డాక్టర్స్ కార్యక్రమాన్ని డాక్టర్స్ ఫర్ బ్రెజిల్ పేరుతో భర్తీ చేశారు. అప్పటి బోల్సెనారో అవమానకరమైన ప్రకటనలతో వైద్య నిపుణులు వెళ్లిపోయారు. ఆ ఖాళీలు ఇప్పటికీ భర్తీ కాలేదని నెసియో తెలిపారు.