Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా ఆగ్రహం
వాషింగ్టన్ : చైనా, తైవాన్ మధ్య మరింత ఉద్రిక్తతలు పెంచేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా తాజాగా మరోసారి అందుకు తెగబడింది. తైవాన్ జలసంధి మీదుగా అమెరికా యుద్ధ నౌక గురువారం ప్రయాణించింది. ఇది రొటీన్ కార్యక్రమంగా అమెరికా మిలటరీ పేర్కొనగా, చైనా ఈ చర్య పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలి సంవత్సరాల్లో అమెరికా యుద్ధ నౌకలే కాదు, మిత్ర దేశాలైన బ్రిటన్, కెనడా వంటి దేశాల యుద్ధ నౌకలు కూడా తైవాన్ జలసంధి మీదుగా ప్రయాణిస్తూ, చైనాను రెచ్చగొడుతున్నాయి. అర్లేగ్ బుర్కె తరగతికి చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ చుంగ్-హూన్ తైవాన్ జలసంధిలో ప్రయాణించిందని అమెరికా మిలటరీ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీనిపై వాషింగ్టన్లోని చైనా ఎంబసీ ప్రతినిధి లియూ పెంగ్యూ ఒక ప్రకటన చేశారు. ఈ చర్యను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఇటువంటి రెచ్చగొట్టే చర్యలను, ఉద్రిక్తతల పెంపును, తైవాన్ జలసంధి వ్యాప్తంగా శాంతి సుస్థిరతకు విఘాతం కలిగించడాన్ని తక్షణమే ఆపాల్సిందిగా అమెరికాను కోరారు. నౌకల స్వేచ్ఛా రాకపోకల పేరుతో అమెరికా యుద్ధ నౌక తరచుగా ఇటువంటి చర్యలకు దిగుతోందని, ఈ ప్రాంతాన్ని స్వేచ్ఛగా, పారదర్శకంగా వుంచడమంటే ఇది కాదని ఆ ప్రకటన పేర్కొంది. చైనా అప్రమత్తతను కొనసాగిస్తుందని, ఏ సమయంలోనైనా బెదిరింపులు, రెచ్చగొట్టే చర్యలకు దీటుగా స్పందించడానికి సిద్ధంగా వుందని పెంగ్యూ పేర్కొన్నారు. చైనా జాతీయ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకుంటామని చెప్పారు.