Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రెజిల్లో జాతీయ కాంగ్రెస్, అధ్యక్షుడి ప్యాలెస్, సుప్రీంకోర్టులపై దాడి
- బోల్సొనారో మద్దతుదారుల అరాచకం
- అల్లర్లను ఖండించిన ప్రధాని మోడీ, జో బైడెన్
బ్రెసీలియా : బ్రెజిల్లో అధికారం కోసం బోల్సొనారో మద్దతుదారులు ప్రభుత్వ భవనాల ఆక్రమణ మొదలుపెట్టారు. మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మద్దతుదారులు ఏకంగా ఆ దేశ రాజధానిలోని కీలక భవనాలను ఆక్రమించారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. 2021లో జనవరి 21న అమెరికాలో క్యాపిటల్ హౌస్‌పై జరిగిన అల్లర్లను ఇవి తలపిస్తున్నాయి. భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని బ్రెసీలియా గవర్నర్‌ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. అల్లర్లకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, దాడులపై వెంటనే విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజధానిలో విధ్వంసం సృష్టించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని అధ్యక్షుడు లూలా స్పష్టం చేశారు. విధ్వంసకారులను మతోన్మాద నాజీలు, ఫాసిస్టులుగా అభివర్ణించారు. దాడులకు పాల్పడ్డవారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని చెప్పారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లూలా విజయంపై బోల్సొనారో అనుమానాలు వ్యక్తం చేశారు. మద్దతుదారులను రెచ్చగొడుతూ దాడికి ఉసిగొల్పారు. ఆ వెంటనే రాజధానిలో అల్లర్లు చోటుచేసుకున్నాయి.
ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బోల్సొనారో ఓటమిని అల్లరి మూకలు నిరాకరిస్తున్నాయి. సుప్రీంకోర్టు, కాంగ్రెస్, అధ్యక్ష భవనాల్లోకి చొచ్చుకెళ్లారు. గత వారమే దేశాధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లూలా ద సిల్వా అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా ఆదివారం వేలాది మంది బోల్సొనారో మద్దతుదారులు భద్రతా వలయాలను ఛేధించుకొని కీలక భవనాల్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో భవనాల్లో ఎవరూ లేరు. కొందరు ఆందోళనకారులు అక్కడి కిటికీలను, విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు.
ఆ దేశ సుప్రీంకోర్టు, నేషనల్ కాంగ్రెస్, అధ్యక్ష భవనాలను దేశ అధికార కేంద్రాలుగా భావిస్తారు. ఈ చర్యతో సుప్రీంకోర్టు వద్ద భద్రతా దళాలు హెలికాప్టర్ల నుంచి టియర్ గ్యాస్‌ను ప్రయోగించాయి. అక్కడ అల్లర్లను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై కూడా దుండగులు దాడులకు దిగారు. సైన్యం జోక్యం చేసుకొని బోల్సొనారోకు అధికారం అప్పజెప్పడంగానీ లేదా ప్రస్తుత అధ్యక్షుడు లూలాను అధికార పీఠం నుంచి దింపేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు మూడువేల మందకిపైగా అల్లరి మూకలు వీటిల్లో పాల్గొన్నట్టు అంచనావేస్తున్నారు. కొందరు ఆందోళనకారులు పోలీసులపై దాడులకు కూడా దిగారు. సమయం గడిచే కొద్దీ అల్లరి మూకల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేషనల్ కాంగ్రెస్ భవనం వద్ద పోలీసులు ఇప్పటికే 300 మందిని అరెస్టు చేశారు. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లను ఈ ఘటనలు తలపిస్తున్నాయి.
అల్లరి మూకలను ఉసిగొల్పారు..
బ్రెజిల్లో అల్లర్లపై దేశాధ్యక్షుడు లూలా స్పందించారు. బోల్సొనారోనే అల్లరి మూకలను రెచ్చగొట్టారని పేర్కొన్నారు. ఆ మూకలను ఫాసిస్ట్ మతోన్మాదులుగా అభివర్ణించారు. భద్రతా దళాలు ఈ అల్లర్లను నిర్దాక్షణ్యంగా అణచివేయాలని ఆదేశాలు జారీచేశారు. 'వారు చేసిన పని వర్ణించలేం. దోషులు శిక్ష అనుభవించాల్సిందే'నని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో లూలాకు 50.9శాతం ఓట్లు లభించగా, బోల్సొనారోకు 49.1శాతం వచ్చాయి. ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి బోల్సొనారో నిరాకరిస్తున్నారు. దేశంలోని కోర్టులు, ఎన్నికల వ్యవస్థలు తనకు వ్యతిరేకంగా పనిచేశాయని ఆయన ఆరోపిస్తున్నారు.
ప్రజాస్వామ్య సంప్రదాయాలను గౌరవించాలి : ప్రధాని మోడీ
బ్రెజిల్లో చోటుచేసుకున్న అల్లర్లను ప్రపంచ దేశాల నేతలు ఖండించారు. భారత ప్రధాని మోడీ బ్రెజిల్లో అల్లర్లపై స్పందించారు. బ్రెజిల్‌లోని ప్రభుత్వ భవనాల విధ్వంసం వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. బ్రెజిల్ అధికారులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వీటిపై స్పందిస్తూ, ''శాంతియుత అధికార మార్పిడి, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. బ్రెజిల్‌లోని ప్రజాస్వామ్య వ్యవస్థలకు మా మద్దతు ఉంటుంది. ఆ దేశ ప్రజల ఆకాంక్షలను అణగదొక్కకూడదు. నేను భవిష్యత్తులో లూలాతో కలిసి పనిచేయడంపై దృష్టి పెట్టాను'' అని ట్వీట్ చేశారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఈ దాడులను ఖండించారు. బ్రెజిల్ ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని కోరారు.
ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం : ఆల్ ఇండియా పీస్, సాలిడారిటీ ఆర్గనైజేషన్
బ్రెజిల్లో అల్లరి మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటీవల ఎన్నికైన అధ్యక్షుడు లూలా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నమిది. జాతీయ కాంగ్రెస్, న్యాయ వ్యవస్థను ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో బోల్సొనారో ఓటమి చెందారు. దీనిని జీర్ణించుకోలేక బోల్సోనారో తన మద్దతుదారుల్ని అధికార కార్యాలయాలపైకి అల్లరి మూకల్ని ఉసిగొల్పుతున్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు అల్లరి మూకలు ప్రయత్నించాయి. అధ్యక్షుడు లూలా, ఆయన యంత్రాంగం తగినవిధంగా జోక్యం చేసుకొని కుట్రలను భంగం చేసింది. ప్రజా అనుకూల విధానాలతో అధికారంలోకి వచ్చిన లూలాను గద్దె దించాలని కొంతమంది కుట్రలకు తెరలేపారు. ప్రజాస్వామ్యంపై ఇలాంటి దాడులను అందరూ ఖండిచాలని కోరుతున్నామని ఆల్ ఇండియా పీస్, సాలిడారిటీ ఆర్గనైజేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.