Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్చరించిన బ్రిటన్ నర్సులు, టీచర్లు
లండన్ : తమ వేతన వివాదాలను జనవరి నెలాఖరులోగా పరిష్కరించని పక్షంలో ఫిబ్రవరి నుంచి నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) సిబ్బంది సమ్మె మరింత ఉధృతమవుతుందని రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ (ఆర్సిఎన్) హెచ్చరించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది నెలలుగా బ్రిటన్‌లో వివిధ రంగాలకు చెందిన కార్మికులు, సిబ్బంది సమ్మెలు చేస్తున్నారు. ఎన్హెచ్ఎస్లో పదివేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, గతంలో ఎన్నడూ లేనంతగా రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆర్సిఎన్ ప్రధాన కార్యదర్శి పాట్ కుల్లెన్ తెలిపారు. ద్రవ్యోల్బణం పెరగడం, జీవన వ్యయ సంక్షోభం, తీవ్రమైన సిబ్బంది కొరత, పెరుగుతున్న పనిభారంతో నర్సులు ఎంతగా నిరుత్సాహానికి గురవుతున్నారో తాము అర్థం చేసుకున్నామని ఎన్‌హెచ్‌సి తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ సఫ్రాన్ కార్టెరీ పేర్కొన్నారు. ఈ సమ్మెలు కలిగించే తీవ్ర ప్రభావాన్ని చూస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశాలు కూడా వున్నాయని, ఇలాంటి పరిస్థితులు కొనసాగాలని ఎవరూ కూడా కోరుకోరని అన్నారు. గతేడాది బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరిగింది. నవంబర్‌లో వినియోగదారుల ధరల సూచిక (సిపిఐ) 10.7 శాతానికి పెరిగింది. అయితే నర్సులకు మెరుగైన వేతనాలుఅందించడంలో ప్రభుత్వం విఫలమైంది. నేడున్న వాస్తవ పరిస్థితులతో పోల్చినట్లైతే నర్సుల జీతాలు 2010లో కన్నా 20 శాతం తక్కువగా ఉన్నాయి.
మరోవైపు వేతనాల పెంపు కోరుతూ ఉపాధ్యాయులు కూడా సమ్మెకే ఓటు వేశారని నేషనల్ ఎడ్యుకేషన్ యూనియన్ (ఎన్ఈయూ) పేర్కొంది. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపింది. జులైలో అందించిన ఐదు శాతం వేతనం పెంపు వాస్తవానికి పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పోల్చితే ఏడుశాతం వేతన కోతకు సమానమని ఎన్‌ఇయు పేర్కొంది. వాస్తవ పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుత వేతనంలో 20 శాతం క్షీణత ఉందని పేర్కొంది. దీంతో చాలా మంది ఉపాధ్యాయ వృత్తినే వదిలివేయాలని భావిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల కార్మిక సంఘాలు విస్తృత సమ్మెలు చేపట్టడం, ఇప్పటికే కష్టాల్లో ఉన్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీస్తోందని ఒక నివేదిక పేర్కొంది. పోస్టల్, రైల్వే సిబ్బంది సమ్మెతో రవాణా, నిల్వలు నవంబరులో క్షీణించాయని తెలిపింది. సమ్మెలు వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొంది.