Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12,000 ఉద్యోగాలకు ఉద్వాసన : సీఈఓ సుందర్ పిచారు వెల్లడి
- అదే బాటలో స్విగ్గీ
శాన్ఫ్రాన్సిస్కో : టెక్నలాజీ కంపెనీల్లోని ఉద్యోగాలు తీవ్ర ప్రమాదంలో పడుతున్నాయి. తాజాగా గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్ వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించాలని నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 12,000 మంది సిబ్బందికి ఉద్వాసన పలుకుతున్నట్లు గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సుందర్ పిచారు వెల్లడించారు. ఇదే విషయమై ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. మిగితా ప్రాంతాల వారికి త్వరలోనే సమాచారం ఇవ్వనున్నారు. ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో ఇప్పటికే ట్విట్టర్, మెటా, అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ప్రతిభను, మూలధనాన్ని అధిక ప్రాధాన్యతల వైపు మళ్లించడంపై దృష్టి సారించాల్సిన సమమయం ఆసన్నమైందని పిచారు పేర్కొన్నారు. రిక్రూటింగ్, కార్పొరేట్ కార్యకలాపాలు, ఇంజినీరింగ్, ప్రొడక్ట్స్ టీమ్‌కు చెందిన విభాగాలతో పాటు ఇతర విభాగాల్లోనూ తొలగింపులు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ కోతలు ఉన్నప్పటికీ.. అమెరికాలో సిబ్బందిపై వెంటనే అమల్లోకి వస్తుందని గూగుల్ తెలిపింది. కాగా.. తదుపరి ఉపాధి చూసుకునే వారికి సాయం అందిస్తామని తెలిపింది. కొలువులు కోల్పోయిన ఉద్యోగులకు తగిన పరిహార ప్యాకేజీ చెల్లిస్తామని పిచారు తెలిపారు. 16 వారాల వేతనంతో పాటు గూగుల్‌లో పనిచేసిన ప్రతి ఏడాదికి రెండు వారాల వేతనంతో పాటు పలు ప్రయోజనాలను ప్యాకేజ్‌లో వర్తింప చేస్తామన్నారు. ఉద్యోగం కోల్పోయిన వారికి 2022కు సంబంధించి బోనస్‌తో పాటు వెకేషన్ టైమ్, ఆరు నెలల పాటు హెల్త్ కేర్, జాబ్ ప్లేస్మెంట్ సర్వీసులు, ఇమ్మిగ్రేషన్ మద్దతును సపోర్ట్‌ను అందించనున్నట్లు తెలిపారు.
అమెరికా వెలుపల పనిచేసే గూగుల్ ఉద్యోగులు సైతం వారి కాంట్రాక్టులకనుగుణంగా బోనస్‌లు, వైద్య బెనిఫిట్స్ పొందుతారన్నారు. కంపెనీ అత్యధిక ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రస్తుత ఉద్యోగులు ఉన్నారా..? లేదా..? అని తేల్చేందుకు పలు ఉత్పత్తి విభాగాల్లో కఠిన సమీక్ష జరిపామని ఉద్యోగులకు రాసిన లేఖలో పిచారు పేర్కొన్నారు. తొలగించిన ఉద్యోగుల్లో కంపెనీలో ఆరు శాతం సిబ్బందికి సమానం. కాగా ఏయే విభాగాల్లో అత్యధికంగా ఉద్యోగులను తొలగించారనే వివరాలను ఆ కంపెనీ ప్రకటించలేదు. 25 ఏండ్ల గూగుల్ ప్రస్తుతం సంక్లిష్ట ఆర్థిక వలయాల మీదుగా సాగుతుందని పిచారు తెలిపారు. ఈ క్రమంలోనే వ్యయాల తగ్గింపునపై దృష్టి పెట్టాల్సి వచ్చిందన్నారు.
స్విగ్గీలో 380 మంది తొలగింపు
బెంగళూరు : గూగుల్ బాటలోనే ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ 380 ఉద్యోగులను తొలగించింది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు శుక్రవారం ఆ కంపెనీ సీఈఓ శ్రీహర్ష మెజెటీ ఈ-మెయిల్లో సమాచారం ఇచ్చారు. సంస్థ పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా అత్యంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సవాళ్లతో కూడిన స్ధూల ఆర్ధిక పరిస్ధితులే ఈ నిర్ణయానికి దోహదం చేశాయన్నారు. ఫుడ్ డెలివరీ విభాగంలో వృద్థి రేటు మందగించిందన్నారు. లాభాలు సన్నగిల్లి రాబడి తగ్గిపోయిందని పేర్కొన్నారు. తొలగించిన ఉద్యోగులకు మద్దతుగా నిలుస్తామని.. మూడు నుంచి ఆరు నెలల్లోగా వారికి నగదు సాయం అందిస్తామని కంపెనీ పేర్కొంది. కంపెనీలో పనిచేసిన కాలం, గ్రేడ్ ఆధారంగా ఈ సాయం ఉంటుందని తెలిపింది. తొలగింపునకు గురైన ఉద్యోగులకు మూడు నెలల వేతనం, ఒక్కో ఏడాది సర్వీసుకు 15 రోజుల పరిహారంతో పాటు ఎర్న్డ్ లీవులకు చెల్లింపులు చేస్తామని పేర్కొంది.