Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెనెట్‌కు తెలియచేసిన మంత్రి
ఇస్లామాబాద్ : గత నాలుగేళ్లలో పాకిస్తాన్లో 42మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముర్తజా జావేద్ అబ్బాసి శుక్రవారం సెనెట్‌కు తెలియచేశారు. వీరిలో 15మంది జర్నలిస్టులు పంజాబ్, 11మంది సింథ్, 13మంది ఖైబర్ ఫక్తూన్‌ఖవా, ముగ్గురు బెలూచిస్తాన్లకు చెందినవారు. ఈ కేసుల్లో జర్నలిస్టులను కాల్చి చంపడం, లక్ష్యంగా చేసుకోవడం, తీవ్రవాదులు హతమార్చడం, ఆచూకీ తెలియకుండా పోవడం వంటివి వున్నాయి. పంజాబ్‌లో ఏడుగురు అనుమానితులను అరెస్టు చేయగా, వారిలో ఇద్దరు బెయిల్‌పై వున్నారు. ఐదుగురిపై విచారణ జరుగుతోంది, మరో 8మంది అనుమానితులు పారిపోయారని, ఒక నిందితుడిని కోర్టు విడుదల చేసిందని సమాచార మంత్రిత్వ శాఖ డేటా పేర్కొంది. అలాగే సింథ్ ప్రావిన్స్‌లో నలుగురు అనుమానితులను అరెస్టు చేయగా, ఏడుగురు విచారణను ఎదుర్కొంటున్నారు. కెపి ప్రావిన్స్‌లో ఇద్దరిని వదిలిపెట్టగా, నలుగురు విచారణ ఎదుర్కొంటున్నారు. జమాత్ ఇస్లామీకి చెందిన ఎంపి ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ ఫెడరల్, ప్రావిన్షియల్ ప్రభుత్వాలు జర్నలిస్టులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. మంత్రి అబ్బాసి స్పందిస్తూ, రెండు మాసాల్లోగా మొత్తంగా ఈ విషయంపై సమగ్ర నివేదిక రూపొందించి, సెనెట్‌కు అందచేయాల్సిందిగా హోం, సమాచార మంత్రిత్వశాఖలను ఆదేశించారు.