Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రెజిల్ నూతన అధ్యక్షుడు లులా ఆరాటం
- యనోమామి ప్రజల కోసం హెల్త్ ఎమర్జెన్సీ
- రోరెమాలో పర్యటన.. తక్షణ చర్యలకు ఆదేశాలు
బ్రసిలియా : బ్రెజిల్ నూతన అధ్యక్షులు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా.. దేశంలో ఆదివాసీల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అమెజాన్ అడవుల్లో నివసించే యనోమామి తెగ చిన్నారుల్లో పోషకాహార లోపం, ప్రజల అనారోగ్యానికి సంబంధించి స్థానిక వెబ్సైట్ ల నుంచి అందిన సమాచారం ఆధారంగా చర్యలకు ఉపక్రమించారు. ఈ విషయంలో అక్కడి ప్రభుత్వం ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటనను చేసింది.
అనంతరం లులా బ్రెజిల్‌లోని ఉత్తర రాష్ట్రమైన రొరేమాను సందర్శించారు. ఇక్కడ ఆదివాసీలు అక్రమ మైనింగ్ కారణంతో వారు మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. యనోమామి ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు అమానవీయమని రాష్ట్ర రాజధాని బోవా విస్తాలో లులా అన్నారు. ఈ ప్రాంతంలో పని చేయడానికి మరింత మంది వైద్యులు, నర్సులను నియమించడం, రవాణా సౌకర్యాలు మెరుగుపర్చటం వంటి చర్యలు ప్రభుత్వం తక్షణమే చేపడుతుందని తెలిపారు. అదనంగా సిబ్బంది నియామకం కోసం గడువు తేదీ లేని ఉత్తర్వుపై ఆ దేశ ఆరోగ్య మంత్రి నిసియా ట్రిండాడే శుక్రవారం రాత్రి సంతకం కూడా చేయడం గమనార్హం. అలాగే, ఆదివాసీల ఆరోగ్యంపై టీమ్ ఇంచార్జీ నివేదికలు ప్రచురించాల్సి ఉంటుంది. అలాగే, లులా మల్టీమినిస్టీరియల్ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. దీనిని మొదటి 90 రోజుల పాటు అధ్యక్షుడి చీఫ్ సమన్వయపరుస్తారు. బొవా విస్తాకు లులాతో పాటు మంత్రులతో కూడిన ప్రభుత్వ బృందం వెళ్లింది. అనారోగ్యంతో ఉన్న అనేక మంది యనోమామి ప్రజలను అక్కడి ప్రత్యేక ఆస్పత్రులలో చేర్చింది. యనోమామి తెగ అనేది బ్రెజిల్‌లోనే అతిపెద్ద తెగ. వెనిజులా సరిహద్దులోని అమెజాన్ అటవీ ప్రాంతంలో దాదాపు 30 వేల మంది వరకు ఉంటారు. వీరిపై జరుగుతున్న అమానవీయ పరిస్థితులపై నిపుణుల నుంచి హెచ్చరికలూ వచ్చాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు సైతం రిపోర్టులనూ ప్రకటించాయి. పోషకాహార లోపంతో బాధపడుతున్న యనోమామి చిన్నారుల కు చెందిన షాకింగ్ చిత్రాలు స్థానిక న్యూస్ వెబ్సైట్ లో వచ్చాయి. దీనికి సంబంధించిన వార్తలతో లులా ఈ తెగ ప్రజలు, పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల కోసం అక్కడ పర్యటించడానికి ఎమర్జెన్సీ పర్యటనకు నిర్ణయిం చారు. గత బోల్సోనారో నాలుగేండ్ల పాలనలో ఐదు లేదా అంతకంటే తక్కువ వయసున్న చిన్నారుల మరణాలు కిందటి ప్రభుత్వంతో పోల్చుకుంటే 29 శాతం పెరిగిందని నివేదికలు తెలిపాయి. అలాగే, యనోమామికి చెందిన చిన్నారులు వ్యాధుల కారణంగా 2019-2022 మధ్య 570 మంది చనిపోవటం గమనార్హం.