Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు చోట్ల కాల్పులు : 9మంది మృతి
కాలిఫోర్నియా : అమెరికాలో కాల్పుల కలకలం కొనసాగుతున్నది. తాజాగా సోమవారం వేర్వేరుగా మూడు చోట్ల జరిగిన కాల్పుల ఘటనల్లో 9మంది మరణించారు. గత శనివారం పొద్దుపోయిన తర్వాత దక్షిణ కాలిఫోర్నియాలో బాల్రూమ్ డ్యాన్స్ హాల్లో 11మందిని కాల్చి చంపిన ఘటన మరువక ముందే తాజాగా ఈ దారుణం చోటు చేసుకుంది. శాన్ఫ్రాన్సిస్కోకు దక్షిణంగా కోస్తా ప్రాంతంలో పుట్టగొడుగుల షెడ్లో, ట్రక్కుల సంస్థ వద్ద జరిగిన రెండు కాల్పుల సంఘటనల్లో ఏడుగురు మరణించారు. మూడో సంఘటనలో అయోవాలోని డెస్ మోయిన్స్లో ఇద్దరు టీనేజర్లు కాల్పులకు గురై చనిపోయారని పోలీసులు తెలిపారు. పుట్టగొడుగుల షెడ్ వద్ద జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోగా, ట్రక్కుల బిజినెస్ దగ్గర ముగ్గురు చనిపోయారని శాన్ మాటెవో కౌంటీ బోర్డు అధ్యక్షుడు డేవ్ తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి 67ఏళ్ళ స్థానిక నివాసి చునాలి ఝావో అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఝావో వాహనంలో సెమీ ఆటోమేటిక్ చేతి తుపాకిని కనుగొన్నారు. మొత్తంగా ఈ కాల్పుల ఘటనల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. 'విషాదం మీద విషాదం' అంటూ కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. యువత చిక్కుల్లో పడకుండా వుండేలా వారిని చైతన్యవంతులను చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమంలో కాల్పులు చోటు చేసుకోగా, ఆ ఘటనలో ఇద్దరు విద్యార్ధులు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది.