Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ, రాజస్థాన్ సహా పలుచోట్ల భూ ప్రకంపనలు
ఖాట్మండు : నేపాల్‌లో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. కాగా, ఢిల్లీ, రాజస్థాన్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2.28గంటల సమయంలో నేపాల్‌లో భూకంపం సంభవించిందని జాతీయ భూకంప కేంద్రం (ఎన్సీఎస్) తెలిపింది. కాగా, ఈ భూకంప కేంద్రం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌కు తూర్పున 148కిలోమీటర్ల దూరంలో వుందని పేర్కొంది. ఢిల్లీలో కూడా భూమి కంపించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. ఫ్యాన్లు, ఇంట్లో వస్తువులు కంపిస్తున్న వీడియోలను ఢిల్లీ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ ప్రకంపనలు దాదాపు ఒక నిముషం వరకు కొనసాగాయి. అయితే ఎక్కడా నష్టం జరిగినట్టు వార్తలందలేదు. 2400కిలోమీటర్ల విస్తీర్ణంలోని హిమాలయన్ కొలిజన్ జోన్లో ఈ భూకంప కేంద్రం వుందని సీనియర్ భూకంప శాస్త్రవేత్త తెలిపారు. ఈ ప్రాంతమంతా భూకంపాలు చాలా ఎక్కువగా వచ్చే ప్రాంతమని, మంగళవారం సాయంత్రం 3గంటలతో ముగిసిన గత 24గంటల్లో మొత్తంగా నాలుగు చోట్ల భూమి కంపించిందని తెలిపారు. అస్సాంలోని కేచర్ రీజియన్‌లో సోమవారం రాత్రి 7గంటలకు, భూటాన్‌లో రాత్రి 10.55గంటలకు, 12.53గంటలకు రెండు చోట్ల, నేపాల్‌లో 5.8 తీవ్రతతో భూమి కంపించిందని చెప్పారు.