Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా విద్యుత్ కోతలను నిరసిస్తూ ఆందోళనలు
జోహాన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలో రికార్డు స్థాయిలో విద్యుత్ కోతలను నిరసిస్తూ ప్రజలు ఆందోళనలు చేపట్టారు. దేశంలో సుదీర్ఘంగా నెలకొన్న ఇంధన సంక్షోభాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జోహాన్నెస్‌బర్గ్ వీధుల్లో ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు. పాలక ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లిన వారిలో చాలామంది ప్రధాన ప్రతిపక్ష పార్టీ డెమోక్రటిక్ అలయన్స్ పతాకం రంగు అయిన నీలి రంగులో దుస్తులు ధరించారు. జరిగింది చాలు, ప్రజలకు విద్యుత్ కావాలి అంటూ నినాదాలు చేశారు. విద్యుత్ కోతలతో ఉపాధులు పోతున్నాయని విమర్శించారు. కేప్‌టౌన్‌తో సహా పలు చోట్ల ప్రదర్శనలు జరిగాయి. డిమాండ్‌కు తగినట్లుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో, కాలం చెల్లిన బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సదుపాయాల నిర్వహణలో ప్రభుత్వ ఇంధన సంస్థ ఎస్కామ్ విఫలం కావడంతో ఏళ్ల తరబడి దక్షిణాఫ్రికాలో విద్యుత్ సంక్షోభం నెలకొంటూనే వుంది. ఏడాది కాలంగా ఈ విద్యుత్ కోతలు మరింత దారుణంగా తయారయ్యాయి. దాదాపు సగం రోజు విద్యుత్ వుండని పరిస్థితి కూడా నెలకొంటోంది. దేశంలో 90శాతం విద్యుత్ అవసరాలను ఎస్కామ్ తీరుస్తుంది. ఇటీవల విద్యుత్ ఛార్జీల పెంపును ఆమోదించడం పట్ల చాలామంది ఆగ్రహంతో వున్నారు. విద్యుత్ కోతలతో దేశవ్యాప్తంగా వాణిజ్య, పారిశ్రామిక రంగం కుదేలైంది. పాలను నిల్వ చేయలేకపోతున్నామని పాల ఉత్పత్తిదారుల సంస్థ తెలిపింది. ప్రజలు విసిగిపోయారని వారి ఆందోళనను అర్ధం చేసుకోగలమని అధ్యక్షుడు సిరిల్ రమాఫాస వ్యాఖ్యానించారు. విద్యుత్ సంక్షోభం దేశాన్ని ధ్వంసం చేస్తోందని అంగీకరిస్తూ, ఒక్కరాత్రిలో పరిష్కారం దొరకదని అన్నారు.