Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 61 మంది మృతి, 150మందికి గాయాలు
పెషావర్ : వాయవ్య పాకిస్తాన్‌లోని పెషావర్ నగరంలో మసీదు లోపల సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 61మంది మరణించగా, 150మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరణించిన వారిలో ఎక్కువమంది పోలీసులు, పోలీసు అధికారులే వున్నారు. దాడికి లక్ష్యంగా పెట్టుకున్న మసీదు విశాలమైన కాంపౌండ్‌లో వుంది. ఆ కాంపౌండ్లోనే నగర పోలీసు ప్రధాన కార్యాలయం కూడా వుంది. ఈ దాడి నేపథ్యంలో దేశమంతా అప్రమత్తతను ప్రభుత్వం ప్రకటించింది. మధ్యాహ్న ప్రార్ధనలు ముగిసిన తర్వాత ఈ దాడి జరిగింది. పేలుడు ధాటికి మసీదు గోడ మొత్తంగా, పైన కప్పు కొంత భాగం లేచిపోయాయి. అనేకమంది పోలీసులు శిధిలాల్లో చిక్కుకుపోయారని, వారిని వెలికితీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పెషావర్ పోలీసు చీఫ్ మహ్మద్ ఇజాజ్ ఖాన్ తెలిపారు. సాధారణంగా మసీదులో ఈ ప్రార్ధనలకు 300నుండి 400మంది అధికారులు హాజరవుతూ వుంటారని చెప్పారు. ఇదొక అత్యవసర పరిస్థితి అని పెషావర్‌లోని ప్రధాన ఆస్పత్రి ప్రతినిధి మహ్మద్ ఆసిం ఖాన్ వ్యాఖ్యానించారు. పెషావర్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయం అత్యంత సున్నితమైన, గట్టి బందోబస్తు గల ప్రాంతాల్లో ఒకటి. ఈ కాంపౌండ్‌లో ఇంటెలిజెన్స్, తీవ్రవాద నిరోధక దళం కార్యాలయాలు వున్నాయి. పాకిస్తాన్‌కు రక్షణగా విధులను నిర్వరిస్తున్న వారిని లక్ష్మంగా చేసుకుని తీవ్రవాదులు భయోత్పాతాన్ని సృష్టించాలనుకున్నారని పాక్ ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రార్ధన జరుపుతున్న వారిలో రెండవ వరుస నుండి దాడి జరిగిందని, బహుశా ఆత్మాహతి దాడి అని అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇమామ్ ప్రార్ధనలు ప్రారంభించిన సెకన్లలోనే ఈ దాడి జరిగింది. వెంటనే అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా తయారైంది.