Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్ : వివాదాస్పద పెన్షన్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్‌లో ప్రజలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. 25 లక్షల మందికి పైగా ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నట్టు ఫ్రెంచ్ ట్రేడ్ యూనియన్ పేర్కొంది. దేశవ్యాప్తంగా 1.27 మిలియన్ ప్రజలు వీధుల్లో మంగళవారం ప్రదర్శన చేపట్టినట్టు ఫ్రెంచ్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 7, 11 తేదీల్లోనూ ఆందోళనలు చేపట్టాలని ఫ్రెంచ్ యూనియన్స్ పిలుపునిచ్చాయి. ఈ నెల 6, 7, 8 తేదీల్లో రిఫైనరీల్లో సమ్మెను కొనసాగించాలని ఫ్రాన్స్‌లోని అతిపెద్ద యూనియన్ జనరల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లేబర్ (సీజీటీ) ప్రకటించింది. కొన్ని రిఫైనరీలలో ఉత్పత్తిని నిలిపివేసే అవకాశం ఉందని టోటల్ ఎనర్జీస్ కో ఆర్టినేటర్ ఎరిక్ సెల్లిని పేర్కొన్నారు. ఈ వివాదాస్పద సంస్కరణ పదవీ విరమణ వయస్సు క్రమంగా ఏడాదికి మూడు నెలలు పెంచుతుంది. దీంతో 2030 నాటికి పదవీవిరమణ వయస్సు 62 ఏండ్ల నుంచి 64కు చేరుతుంది. అయితే పెన్షన్ సంస్కరణలపై లేవనెత్తిన ప్రశ్నలను మరియు సందేహాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని ఫ్రెంచ్ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్ తెలిపారు. పార్లమెంటులో చర్చ ప్రారంభమవుతుందనీ, ఈ పథకం పారదర్శకంగా అమలు చేసేందుకు అవకాశం లభిస్తుందని అన్నారు.ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ప్రవేశపెట్టిన వివాదాస్పద పెన్షన్ సంస్కరణలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుండి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నాయి. జనవరి 31న జరిగిన సమ్మె హింసాత్మకంగా మారిన సంగతి తెలసిందే. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షనలు చెలరేగాయని, పోలీసులు టియర్‌గ్యాస్, పొగ బాంబులను ప్రయోగించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.