Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్, బీజింగ్ : పొరపాటున అమెరికా గగనతలంలోకి ప్రవేశించిన చైనాకు చెందిన వాతావరణ పరిశోధన బెలూన్ను యుద్ద విమానంతో అమెరికా కూల్చివేసింది. అమెరికా చర్యను చైనా 'ఓవర్ రియాక్షన్' (అతి స్పందన)గా అభివర్ణించింది. తమ దేశంలో వాతావరణ పరిశోధనలకోసం ప్రయోగించిన మానవ రహిత బెలూన్ పొరపాటున అమెరికా గగన తలంలోకి ప్రవేశించిన విషయాన్ని ముందుగానే తెలియచేశామని, అయినా కూల్చివేయడంతో అమెరికాపై తగిన చర్యలు తీసుకునే హక్కు తమకుందని పేర్కొంది. దోమపై ఫిరంగితో దాడిచేయడంగా చైనా సైనిక నిపుణులు ఈ చర్యను పేర్కొన్నారు. మరోవైపు అమెరికా తన చర్యను సమర్ధించుకుంది. బెలూన్ను చైనా గూఢాచర్యానికి వాడుతోందని అమెరికా ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ ' బెలూన్ గురించి సమాచారం తెలియగానే వీలైనంత త్వరగా కూల్చివేయాలని ఆదేశించాను. దాని శకలాల కారణంగా భూమిపై నష్టం జరుగుతుందేమోనని వేచిచూశారు. అది భూభాగం దాటి సముద్రంపైకి వెళ్లిన వెంటనే అమెరికా ప్రాదేశిక జలాల పరిధిలోనే కూల్చివేయాలని నిర్ణయించారు. దాన్ని విజయవంతంగా అమలు చేసిన మా ఏవియేటర్లను అభినందిస్తున్నాను' అని అన్నారు. బెలూన్ దక్షిణ కరోలినా తీరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిందని స్థానిక మీడియా నివేదించింది. అంతర్జాతీయ సైనిక నిపుణులు కూడా అమెరికా చర్యను తప్పుపడుతున్నారు. పరిశోధనలకు, సైనిక చర్యలకు మధ్య తేడానే గుర్తించలేని స్థితిలో అమెరికా ఉందా? అని నిపుణులు ప్రశ్నించారు. రాజకీయ బల ప్రదర్శనగానే వారు దీనిని భావిస్తున్నారు.