Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివిధ నగరాల్లో వేలాది భవనాలు నేలమట్టం
- మృతులు, గాయపడ్డవారితో నిండిపోయిన హాస్పిటల్స్
- ప్రకృతి ప్రళయంతో...కట్టుబట్టలతో గడ్డకట్టే చలిలో పౌరులు
- మొదటి భూకంపం తర్వాత 20మార్లు కంపించిన భూమి
- సైప్రస్, లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల్లోనూ భూకంప ప్రభావం
ఇస్తాంబుల్:సోమవారం తెల్లవారుజామున సంభవిం చిన భూకంప తాకిడికి టర్కీ, సిరియా దేశాలు విలవిల్లాడి పోయాయి. భూకంపం అంటే ఇలా ఉంటుందా? అని ప్రపంచం యావత్తు భీతిల్లిపోయింది. తెల్లవారు జామున 4.17 గంటలకు, ఉదయం 10.30 గంటలకు టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతంలో రెండు భీకరమైన భూ కంపాలు ఏర్పడ్డాయి. దీంతో ఒక్కసారిగా భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. అందులో చిక్కుకున్న వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరు దేశాల నుంచి వెలువడిన అధికారిక సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 2308 దాటింది. టర్కీ ఆగేయ ప్రాంతంలో, ఉత్తర సిరియాలోని పలు నగరాల్లో పౌరులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మొదటి భూకంపం తర్వాత భూమి 20సార్లకుపైగా కంపించింది. ఉదయం 10.30 గంటలకు 7.5 తీవ్రతతో రెండోసారి భూకంపం సంభవించింది.
దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వృద్ధులు, చిన్నారులతో కట్టుబట్టలతో బయటకు వచ్చామని, మరోవైపు ఆరు బయట మంచు పెద్ద ఎత్తున కురుస్తోందని పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టర్కీలోని పలు నగరాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల సెల్సీయస్‌కు పడిపోయాయి.
సాయమందించండి : వివిధ దేశాల నేతలు పిలుపు
భూకంప ఘటనలపై ప్రపంచ దేశాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టర్కీ, సిరియాలకు ఎన్డీఆర్ఎఫ్, వైద్య బృందాలను, సహాయక సామగ్రిని పంపాలని ప్రధాని మోడీ అధికారులను ఆదేశించారు. ప్రపంచ దేశాలు టర్కీ, సిరియాకు మానవతా సాయం అందించాలని భారత ప్రధాని సహా వివిధ దేశాల నేతలు కోరారు. ప్రస్తుతానికి టర్కీలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళన కర స్థాయిలో ఉంది.
గాయపడ్డవారితో, మృతులతో హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయి. టర్కీలోని గజియాన్టెప్, కహ్రమాన్‌మరస్, హుటారు, ఒస్మానియె, అడియమన్, మలట్య, అడన, కిలిస్ తదితర నగరాలపై ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు. సోమవారం నాటి భూకంపాలు లెబనాన్, సైప్రస్, ఇజ్రాయెల్ దేశాల్ని తాకాయి.
పెరుగుతున్న మృతుల సంఖ్య
భూకంపం ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 1700 మందికిపైగా దుర్మరణం చెందారని, గాయపడ్డవారి సంఖ్య లక్షల్లో ఉందని వార్తలు వెలువడుతున్నాయి. టర్కీ కాలమానం ప్రకారం, తెల్లవారుజామున 4.17 గంటలకు ఆ దేశ ఆగేయ ప్రాంతంలో ఉన్న గాజియాన్‌తెప్ ప్రాంతానికి సమీపంలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. అక్కడికి 33 కి.మీ దూరం, 18 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడిం చింది. మొదటి భూకంపం తాకిడికి దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపింది. టర్కీలోని దియర్‌బకీర్, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కూలి పోయాయి. తొలి భూకంపం సంభవించిన మరికొద్ది గంటలకు (సుమారుగా ఉదయం 10.30 గంటలకు) మరో శక్తివంతమైన (7.5 తీవ్రత) భూకంపం ఏర్పడింది. దాదాపు 20 సార్లు శక్తివంతమైన భూకంపాలు చోటుచేసుకున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
గాఢనిద్రలో ఉండగా..
తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ విలయం చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. టర్కీలో మొత్తం 10 ప్రావిన్సుల్లో భూకంపం ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు 1498 మంది మరణించారని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ వెల్లడించారు. 5300 మందికిపైగా గాయపడినట్టు చెప్పారు. భూకంపం తాకిడికి టర్కీలో దాదాపు 3వేల భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక సిరియాలోని ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాల్లో 810 మంది మరణించినట్టు సిరియా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరో 639 మంది గాయపడినట్టు తెలిపింది. కాగా రెబల్స్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 400 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.