Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంకారా : భూకంప మృతుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. వరుస భూకంపాల ధాటికి ఇప్పటివరకు టర్కీ, సిరియాల్లో 5,100 మందికి పైగా మరణించినట్టు అధికారులు తెలిపారు. సోమవారం ఆగేయ టర్కీ, ఉత్తర సిరియాలలో 7.8, 7.6 తీవ్రతతో ప్రకంపనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఏడోరోజుల పాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. టర్కీలో భూకంప మతుల సంఖ్య 3,500కు చేరుకుందని టర్కీ ఉపాధ్యక్షుడు ఓక్టే మంగళవారం తెలిపారు. 20,426 మంది గాయాలపాలవగా, 5,700 భవనాలు నేలమట్టమయ్యాయని టర్కీ డిజాస్టర్, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ (ఏఎఫ్ఏడీ) పేర్కొంది. 10 ప్రావిన్స్‌లలో సుమారు 7,800 మందికి పైగా ప్రజలను రక్షించామనీ, గాయపడిన వారితో ఆస్పత్రులు నిండిపోయాయని తెలిపింది. 12 ఏళ్ల పాటు అంతర్యుద్ధంతో అతలాకుతలమైన సిరియాను భూకంపం మరింత వణికిస్తోంది. సిరియాలో అధికారిక లెక్కల ప్రకారం 1,602 మంది మరణించగా, సుమారు 3,500 మంది గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ భారీ భూకంపంలో 20 వేల మందికి పైగా మరణించి ఉంటారని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది.