Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అహర్నిశలు శ్రమిస్తున్న సహాయక సిబ్బంది
ఇస్తాంబుల్: టర్కీ, సిరియాలను కుదిపేసిన పెను భూకంపంలో మృతుల సంఖ్య బుధవారానికి 11,200కి పైగానే వుంది. మరోవైపు శిధిలాల కింద చిక్కుకుపోయిన వందలాది మందిని వెలికితీసేందుకు సహాయక సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. 48 గంటలు గడుస్తుండడంతో పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు వున్నాయని భయపడుతున్నారు. టర్కీలో ఇప్పటివరకు 8,574 మంది చనిపోగా, సిరియాలో 2,662 మంది మరణించారని ఇరు దేశాల అధికారులు, వైద్య సిబ్బంది తెలిపారు. టర్కీలో దాదాపు 50 వేల మంది గాయపడగా, సిరియాలో మరో ఐదువేలమంది గాయపడ్డారు. తొలిసారి వచ్చిన భూకంప కేంద్రమైన కహ్రామన్మారస్ లో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పర్యటించారు. ఈ నగరంలో కుప్పకూలిన అపార్ట్మెంట్ శిధిలాల నుండి మూడేళ్ళ బాలుడు ఆరిఫ్ ఖాన్ను దాదాపు రెండు రోజుల తర్వాత సజీవంగా వెలికి తీశారు. కొద్ది గంటల తర్వాత అదియామన్ నగరంలో పదేళ్ళ బీటుల్ ఎడిస్ను ఇలాగే శిధిలాల నుండి కాపాడారు. ఈ రెండు సంఘటనలతో సహాయక కార్యకర్తల్లో ఇంకా ఆశలు సజీవంగా వున్నాయి. శిధిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడగలమనే ఆశ కలుగుతోంది. ఇదిలా వుండగా, భూకంపాలకు ధ్వంసమైన ప్రాంతాలను ఏడాదిలోగా పునర్నిర్మాస్తామని ఎర్డోగన్ హామీ ఇచ్చారు.
జపాన్లో 2011లో సునామీ రావడానికి కారణమైన భూకంపం కన్నా ఇది శక్తివంతమైన భూకంపం. టర్కీలో బాధితుల్లో చాలామంది తమ కారుల్లోనే నిద్ర పోతున్నారు. టెంట్ కానీ, హీటింగ్ స్టవ్కానీ లేదని, పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారని, దానికి తోడు వర్షంతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిందని వారు వాపోతున్నారు. ఆకలితో లేదా ఈ భూకంపంలోనో తాము చనిపోవడం లేదని, ఎముకలు కొరికేస్తున్న చలితో పోయేలా వున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బుధవారానికి దాదాపు 25 దేశాలకు చెందిన సహాయక బృందాలు టర్కీ చేరుకున్నాయి. అలాగే సహాయం కూడా వెల్లువెత్తుతోంది. సిరియాలో రెబెల్స్ అదుపులో వున్న ప్రాంతాలకు సహాయ సరఫరాలు అందేలా చూసేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని ఐక్యరాజ్య సమితి తెలిపింది.
సిరియాలో శిధిలాల్లో నవజాత శిశువు!
వాయవ్య సిరియా పట్టణంలో శిధిలాల కింద ఇంకా బొడ్డూడని నవజాత శిశువుని అక్కడి ప్రజలు గుర్తించారు. భూకంపం వచ్చిన సమయంలో ప్రసవించిన తల్లి వెంటనే చనిపోయింది. ఇతర కుటుంబ సభ్యులు కూడా శిధిలాల కింద నలిగి చనిపోయారు. కానీ తల్లి నుండి బొడ్డు తాడు కూడా వేరుపడని ఆ చిన్నారి మాత్రం మట్టిలో కప్పబడి ఏడుస్తూ కనిపించడంతో అధికారులు వెంటనే రక్షించి, ఆస్పత్రిలో చేర్చారు. విపరీతమైన చలి కారణంగా ఆ పాప హైపోథెర్మియాకు గురైందని, వెంటనే శరీరాన్ని వెచ్చ బరిచి, తగిన చికిత్స చేశామని వైద్య సిబ్బంది తెలిపారు.