Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్నారుల ఫొటో సోషల్ మీడియాలో వైరల్
సిరియా: టర్కీ, సిరియాల్లో సంభవించిన పెను భూకంపం తీరని విషాదాన్ని నింపింది. ఎన్నో వేలమంది ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే..! ఇంతటి విషాదంలోనూ ఇద్దరు చిన్నారుల దృశ్యం యావత్ ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది. ఇద్దరు చిన్నారులకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూకంపం ధాటికి కుప్పకూలిన ఓ భవన శిథిలాల కింద ఓ బాలిక, తన తమ్ముడితో ఇరుక్కుపోయింది. స్లాబ్‌కు ఒకవైపు నేల, మరోవైపు పిల్లర్ సపోర్టుగా ఉండటంతో వారు ప్రాణాలతో బిక్కు బిక్కు మంటూ అక్కడే ఉండిపోయారు. ప్రాణభయంతో గంటలపాటు శిథిలాల కిందే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో బాలిక తన తమ్ముడి కోసం ఆరాటపడింది. శిథిలాలకింద తమ్ముడు ఇరుక్కుపోయాడు. అతడి తలకు ఆ బాలిక తన చేయిని అడ్డంపెట్టింది. రక్షించింది. నీకు నేనున్నాను.. నీకేం కాదని భరోసా కల్పించింది. ఈ ఫొటోను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లంతా... అక్కా తమ్ముడి ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. బాలికను ప్రశంసిస్తున్నారు. తమ్ముడికి ధైర్యం చెబుతూ ఆ బాలిక సహాయం కోసం ఎదురుచూసింది. ఇలాంటి సంఘటనలు టర్కీ, సిరియాల్లో కనిపిస్తున్నాయి.
మూడు నెలలుపాటు ఎమర్జెన్సీ
టర్కీలో సోమవారం సంభవించిన భూకంప తీవ్రతకు వేలాది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. భూకంప తీవ్రతకు 10 ప్రావిన్సులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రభావితమైన 10 ప్రావిన్స్‌లలో మూడు నెలలపాటు ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'రాజ్యాంగంలోని ఆర్టికల్ 119 ప్రకారం పది ప్రావిన్స్‌లలో మూడునెలలపాటు అత్యవసర పరిస్థితిని విధించాలని మేం నిర్ణయించుకున్నాం. భూకంపం వల్ల శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీయడానికి రెస్క్యూ సిబ్బంది మరింత వేగంతో పనిచేస్తున్నారు' అని ఆయన అన్నారు. ఇప్పటివరకున్న తాజా సమాచారం ప్రకారం.. 5,895 మంది మతి చెందారని, 34,810 మందికి గాయాలయ్యా యని.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని రెసెప్ మీడియా సమా వేశంలో వెల్లడించారు. కాగా, టర్కీలో కహ్రమన్మరాస్, అదానా, అడియామాన్, ఉస్మానియే, హటే, కిలిస్, మలత్య, సాన్లియుర్ఫా, దియార్బాకిర్, గజియాంటెప్లు భూకంప ధాటికి అత్యంత ప్రభావితమైన ప్రావిన్స్‌లుగా ఉన్నాయి.