Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నింగినంటుతున్న నిత్యావసరాల ధరలు
- సంక్షోభంతో సామాన్యుల వెతలు
ఇస్లామాబాద్ : ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లో నిత్యావసరాల ధరలు అమాంతం పెరగడంతో.. అక్కడి ప్రజలు బతకడం కష్టమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారం రోజులుగా నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. అనేక నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ఇటీవల కాలంలో రుణాలు తీసుకుంటూ శ్రీలంక కొంతమేర ఆర్థికంగా పుంజుకుంటున్నా.. పాకిస్తాన్ మాత్రం ఆ దేశం నుంచి ఇంకా గుణపాఠాలు నేర్చుకోకపోవడం శోచనీయం. పాకిస్తాన్ ఆర్థిక మాంద్యం నుంచి పుంజుకోవడానికి రుణాలను తీసుకున్నా.. వాటిని తిరిగి చెల్లించలేక అవస్థలు పడుతోంది. దాదాపు ప్రపంచంలోనే రుణ ఎగవేతకు దగ్గరలో ఉన్న అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో పాకిస్తాన్ ఐదో దేశంగా నిలవనుందని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం 48 ఏళ్ల గరిష్టానికి చేరింది. దీంతో అక్కడి ప్రజల జీవనం కష్టతరమౌతుంది. ఇక గతేడాది వరదల ప్రభావం అక్కడి ప్రజల పైనా, ఆర్థిక వ్యవస్థపైనా ఇప్పటికీ కొనసాగుతోంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ఈ వారంలో పాక్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుండి 6.5 బిలియన్ డాలర్ల రుణం కోసం ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాదిలో జరగబోయే నేషనల్ అసెంబ్లీ ఎన్నికలు గందరగోళంగా మారే అవకాశముందని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
గతంలో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ కానీ, ఇప్పుడున్న షెహబాజ్ షరీఫ్‌లు కానీ పాక్ అభివృద్ధి దిశగా ప్రయత్నాలు చేయకపోవడం ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారని ప్రముఖ మీడియా ఛానెల్ బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఆర్థికంగానూ, రాజకీయంగానే కాదు.. అక్కడ ఉగ్రవాదం కూడా పెచ్చరిల్లడం ఆ దేశాభివృద్ధికి పెను సమస్యగా దాపురించింది. ఇటీవల పెషావర్ నగరంలోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడివల్ల దాదాపు 100 మందికిపైగా మృతి చెందారు.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అక్కడి ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి బ్లూమబర్గ్ అనే న్యూస్ ఛానెల్ పాకిస్తానీయులను పలకరించింది. ఈ ఛానెల్‌తో మొహమ్మద్ రషీద్ అనే ఓ రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ... 'పెరుగుతున్న ధరల ద్రవ్యోల్బణం వల్ల స్థానిక వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ శీతాకాలంలో తన రెస్టారెంట్లో సీ ఫుడ్స్ 50 శాతం మేర విక్రయాలు తగ్గాయి. ధరలు పెరగడం వల్ల మధ్యతరగతి కస్టమర్లు సీ ఫుడ్‌కి దూరంగా ఉంటున్నారు.' అని అన్నారు.
ఇక గ్యాస్ స్టేషన్ మేనేజర్ ఇర్ఫాన్ అలీ బ్లూమ్‌బర్గ్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. 'ప్రభుత్వం గత నెలలో పెట్రోల్ ధర పెంచింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 262గా ఉంది. దీంతో ప్రయాణీకులు.. తమ ప్రయాణలను తగ్గించుకుంటున్నారు. లీటర్ పెట్రోల్ ధర రూ.200 ఉన్నప్పుడు 15 వేల లీటర్ల పెట్రోల్‌ని అమ్మాం. ఇప్పుడు రూ. 250కి పైగా ఉండడంతో రోజుకు 13 వేల లీటర్లే అమ్ముతున్నాము. ఒక్కోరోజు అంతకంటే తక్కువగా అమ్ముతున్నాము. ప్రస్తుతం పార్కో పాకిస్తాన్ లిమిటెడ్ పెట్రోల్ బంక్‌లు ఖాళీగా ఉంటున్నాయి' అని ఇర్ఫాన్ అలీ చెప్పుకొచ్చారు.
చాలామంది పాకిస్తానీయులు రోజువారీ అవసరాల కోసం అప్పులు చేస్తున్నారు. ఫర్జానా అనే మహిళ తన ఇంటి అవసరాల కోసం ఐదు వేల రూపాయల్ని అప్పు చేయగా.. దాన్ని తీర్చలేక 16 ఏళ్ల తన కుమారుడిని చదువు మాన్పించి రెస్టారెంట్లో పనికి పంపిస్తున్నట్లు మీడియాతో చెప్పారు. తన దగ్గరున్న నగలన్నీ కూడా అమ్ముకున్నానని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఇక మహమ్మద్ రషీద్ అనే ఓ రైతు మీడియాతో మాట్లాడుతూ.. 'గత రెండేళ్లలో కూలీల రేట్లు బాగా పెరిగిపోయాయి. వ్యవసాయ ఖర్చులు భారీగా పెరిగాయి. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు' అని అన్నారు.