Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూహెచ్ఓ ఆందోళన
న్యూయార్క్ : గర్భధారణ, ప్రసవ సమస్యలపై గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. గర్భధారణ, లేదా ప్రసవ సమయంలో ప్రతి రెండు నిమిషాలకు ఓ మహిళ మృతి చెందుతున్నదని తాజా గణాంకాలను సూచించే ఓ నివేదిక పేర్కొంది. ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. గర్భధారణ, ప్రసవం అనేవి మహిళలందరికీ ఆశాజనకంగా, సానుకూల అంశంగా ఉండాల్సి ఉండగా.. ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పదిలక్షలకు పైగా మహిళలకు ఇది ప్రమాదకరంగా మారుతోందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రసవానికి ముందు, ప్రసవ సమయంలో మరియు అనంతరం ప్రతి స్త్రీ, బాలికలకు సురక్షితమైన ఆరోగ్య సేవలు అందాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు చూపుతున్నాయని అన్నారు. ప్రతి స్త్రీ తన సంతానోత్పత్తి సమయంలో పొందాల్సిన హక్కులను పూర్తిగా అందించాల్సిన ఆవశ్యకతను పునరుద్ఘాటించారు.
ప్రసవానంతరం తీవ్ర రక్తస్రావం, అధిక రక్తపోటు, గర్భధారణ సమయంలో అంటువ్యాధులు, తీవ్రమయ్యే శారీరక సమస్యలు, అసురక్షిత అబార్షన్ కారణంగా వచ్చే సమస్యలు ప్రసూతి మరణాలకు కారణమవుతున్నాయని పేర్కొంది. ఇవన్నీ చాలావరకు నివారించతగినవి, చికిత్స చేయదగినవేనని తెలిపింది. ప్రసూతి మరణాలు పేద, యుద్ధ ప్రభావిత దేశాల్లో అధికంగా ఉంటున్నాయని తెలిపింది.
2000-2015 మధ్య ప్రసూతి మరణాలను తగ్గించడంలో గణనీయమైన పురోగతి కనిపించినప్పటికీ.. 2020 నుంచి ఐదేండ్లలో కొన్ని దేశాల్లో ఆ సంఖ్య అలాగే నిలిచిపోగా, మరికొన్ని దేశాల్లో పెరిగినట్టు ఆ నివేదిక పేర్కొంది. 2016 నుంచి ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ దేశాలు మాత్రమే ప్రసూతి మరణాల రేటుని గణనీయంగా తగ్గించగలిగాయని తెలిపింది. నివేదిక ప్రకారం... ఎనిమిది ఐక్యరాజ్యసమితి ప్రాంతాల్లో యూరప్, ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా మరియు కరేబియన్ దేశాలలో ప్రసూతి మరణాల రేటు 17 శాతం పెరిగినట్టు పేర్కొంది. రెండు రీజియన్లలో ఎలాంటి పెరుగుదల లేదని తెలిపింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో ప్రసూతి మరణాల రేటు 35 శాతం తగ్గగా, దక్షిణాసియలో 16 శాతం తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. 2020లో మొత్తం ప్రసూతి మరణాల్లో 70 శాతం ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతాల్లో నమోదైనట్టు పేర్కొంది.
మానవతా సంక్షోభాలను ఎదుర్కొంటున్న తొమ్మిది దేశాల్లో ఈ రేటు ప్రపంచ సగటు కంటే రెట్టింపుగా ఉందని తెలిపింది. సుమారు 2.7 కోట్ల మందికి ఆధునిక కుటుంబ నియంత్రణ పద్ధతులు అందుబాటులో లేవని, సుమారు మూడింట ఒకవంతు మంది స్త్రీలు వైద్యులు సిఫార్సు చేసిన ఎనిమిది ప్రసవాంతర తనిఖీల్లో నాలుగింటిని కూడా కలిగి లేరని, అలాగే అవసరమైన ప్రసవానంతర సంరక్షణను పొందడం లేదని నివేదిక తెలిపింది. కరోనా మహమ్మారి ఆరోగ్య సంరక్షణపై కొంత ప్రభావం చూపి ఉండవచ్చని, అయితే వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు అదనపు కషి చేయాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది.
సురక్షితమైన వైద్యసదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో లక్షలాది కుటుంబాల్లో ప్రసూతి మరణం విషాదాన్ని నింపుతోందని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరిన్ రస్సెల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఓకే సంవత్సరంలో 2,80,000 కంటే ఎక్కువ మరణాలు అనైతికమని ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాలియా కనెమ్ పేర్కొన్నారు. ఈ మరణాలను అడ్డుకునేందుకు అవసరమైన సాధనాలు, వైద్యజ్ఞానం, వనరులు ఉన్నాయని... కానీ ఇప్పుడు మనకి కావాల్సింది ప్రభుత్వాల చొరవ అని అన్నారు.