Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుకూలం 141..వ్యతిరేకం 7
- ఏడాది గడిచినా..ఆగని సంక్షోభం
ఐక్యరాజ్యసమితి : రష్యా సైనిక చర్యను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మరోసారి దూరం పాటించింది. ప్రస్తుత ఓటింగ్‌లో మరో 31 దేశాలు ఇదే వైఖరిని పాటించాయి. తమ దేశంలో శాంతిని నెలకొల్పే ముసాయిదా తీర్మానం విషయంలో సహకారం అందించాలని ఉక్రెయిన్ చేసిన విజ్ఞప్తికి భారత్ నుంచి సానుకూలత లభించలేదు. ఐక్యరాజ్యసమితిలో గురువారం ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన శాంతి ప్రణాళిక ముసాయిదాపై జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించడంలో, శాంతి నెలకొల్పడంలో భారత్ కీలక పాత్ర పోషించాలని ఇదివరకు ఫ్రాన్స్ కోరింది. ఈమేరకు ఫ్రాన్స్ దౌత్య బృందం గట్టిగానే ప్రయత్నించింది. కానీ భారత్ ఇప్పటివరకూ రష్యా అనుకూల వైఖరినే కొనసాగిస్తోంది. ఐరాస ఛార్టర్‌లోని సూత్రాలకు అనుగుణంగా శాశ్వత శాంతి స్థాపన నిమిత్తం శాంతి ప్రణాళికను ఉక్రెయిన్ సిద్ధం చేసింది. ఈ దేశంపై రష్యా సైనిక చర్య చేపట్టి ఏడాది గడిచిన నేపథ్యంలో దానిని గురువారం 193 సభ్యుల జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ ముసాయిదా తీర్మానానికి 141 మంది అనుకూలం గా ఓటేయగా..7 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. 32 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అందులో భారత్ ఒకటి. ఈ శాంతి ప్రణాళికను ప్రవేశపెట్టడానికి ముందు ఉక్రెయిన్ నుంచి భారత్‌కు ఫోన్ వచ్చింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ అధిపతి యాండ్రీ యెర్మాక్ బుధవారం ఫోన్లో మాట్లాడారు. తీర్మానం విషయంలో అనుకూలంగా ఓటు వేయాలని కోరారు.