Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర కొరియా నేత కిమ్ సోదరి హెచ్చరిక
సియోల్ : అమెరికా, దక్షిణ కొరియాలపై శీఘ్రగతిన చర్య తీసుకోవడానికి తమ దేశం సిద్ధంగా వుందని ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి హెచ్చరించారు. తమ బలాన్ని ప్రదర్శిస్తూ అణు సామర్ధ్యం కలిగిన బి-52 బాంబర్‌ని అమెరికా ప్రదర్శించిన మరుసటి రోజే ఈ హెచ్చరిక వెలువడింది. ఇటీవలి మాసాల్లో అమెరికా, దక్షిణ కొరియాల మధ్య వరుసగా జరుగుతున్న విన్యాసాల్లో భాగంగా కొరియాద్వీపకల్పంపై సోమవారం బి-52 బాంబర్లు చక్కర్లు కొట్టాయి. ఈ నెలాఖరులో ఈ రెండు దేశాల మిలటరీలు కూడా అతిపెద్ద విన్యాసాలను పునరుద్ధరించడానికి సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కిమ్ సోదరి హెచ్చరిక వెలువడింది. అయితే అమెరికా, దక్షిణకొరియాలపై ఎలాంటి చర్య తీసుకుంటారనేది ఆమె వెల్లడించలేదు. కానీ అమెరికా మిలటరీ డ్రిల్స్‌కు ప్రతిస్పందనగా ఉత్తర కొరియా తరచుగా క్షిపణి పరీక్షలను నిర్వహిస్తూనే వుంది. ఒకవేళ ఉత్తర కొరియాపై దాడి జరిగితే ఇది రిహార్సల్స్ అని భావిస్తోంది. ''అమెరికా, దక్షిణ కొరియా సైన్యాలు అవిశ్రాంతంగా చేస్తున్న విన్యాసాలను మేం గమనిస్తూనే వున్నాం. ఏ సమయంలోనైనా వాటిపై శీఘ్రగతిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగానే వున్నాం'' అని ఆమె స్పష్టం చేశారు.