Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాంతీయ భద్రత పేరుతో ఘర్షణలను రెచ్చగొట్టాలన్నదే వారి లక్ష్యం
- చైనాను అణగదొక్కాలని చూస్తున్నారు
- అమెరికా వైఖరిపై మండిపడ్డ చైనా
బీజింగ్ : ఇండో-పసిఫిక్ వ్యూహం ద్వారా 'చైనాను ముట్టించడానికి' అమెరికా ప్రయత్నిస్తోందని చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ విమర్శించారు. ''ప్రత్యేకమైన బ్లాక్‌లను ఏర్పాటు చేసి, ఘర్షణలను రెచ్చగొట్టి, ప్రాంతీయ సమగ్రతకు విఘాతం కలిగించాలన్నదే అమెరికా అనుసరించే ఇండో-పసిఫిక్ వ్యూహం లక్ష్యం.'' అని అన్నారు. బీజింగ్‌లో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ) లేదా పార్లమెంట్ సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించే వార్షిక పత్రికా సమావేశంలో కిన్ గాంగ్ మాట్లాడారు. ''ప్రాంతీయ భద్రతను పరిరక్షించేందుకే ఇండో-పసిఫిక్ వ్యూహం అని చెబుతున్నారు, కానీ, వాస్తవానికి, ఆ వ్యూహం ఘర్షణలను రెచ్చగొడుతోంది. నాటోకు ఆసియా-పసిఫిక్ వర్షన్‌ను సృష్టించాలని భావిస్తోంది.'' అని అన్నారు. క్వాడ్,అకస్ (ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా) గ్రూపులను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఎన్పిసి సమావేశాల సందర్భంగా ప్రతినిధి బృందాన్ని ఉద్దేశించి సోమవారం అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ, అమెరికాను ప్రత్యక్షంగా విమర్శిం చారు. ఆ తర్వాతే కిన్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. చైనాను అన్ని విధాలుగా అదుపు చేయాలని, అణగదొక్కాలని అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని జిన్‌పింగ్ విమర్శిం చారు. కీలకమైన పరిశ్రమల్లో స్వావలంబన సాధించాలన్నది ఎన్పిసి సమావేశాల ప్రధాన ఉద్దేశ్యంగా వుందని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఈనెల 13వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ప్రభుత్వ విభాగాలపై మరింతగా పార్టీ నియంత్రణను తీసుకువచ్చేందుకు, పర్యవేక్షణకు పార్టీ-ప్రభుత్వ యంత్రాంగం ప్రక్షాళనకు పలు చట్టాలను ఈ సమావేశంలో ఆమోదిస్తారని భావిస్తున్నారు. జిన్‌పింగ్ ఆధ్వర్యంలో కేంద్రీకరణ విధానాన్ని కొనసాగించేలా ఈ చర్యలు వుండనున్నాయి. చైనాకు గల 60లక్షల కోట్ల డాలర్ల బ్యాంకింగ్ ఆస్తులను నిర్వహించడానికి అత్యున్నత నియంత్రణా సంస్థ నేషనల్ ఫైనాన్షియల్ రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
చైనా-అమెరికా సంబంధాలు మరింతగా దిగజారుతుండడంపైఈ పత్రికా సమావేశంలో కిన్ గాంగ్ సవివరంగా మాట్లాడారు. తైవాన్‌పై చైనా రెడ్‌లైన్‌ను మరోసారి గుర్తు చేశారు. శాంతియుత పునరేకీకరణను అనుసరించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని చెప్పారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన పత్రికా సమావేశంలో మాట్లాడారు. అయతే భారత్‌తో సంబంధాలపై కిన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న చైనా విధానంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. చైనాతో పోటీ పడడం కాదని, చైనాను అన్ని రంగాల్లో అణగదొక్కాలన్నదే వారి లక్ష్యమని విమర్శించారు. తైవాన్ విషయంలో ఆసియా, ఉక్రెయిన్ తరహా సంక్షోభాన్ని చూడరాదని ఆయన వ్యాఖ్యానించారు. ఒకపక్క చైనా సార్వభౌమాధి కారాన్ని, ప్రాదేశిక సమగ్రతను కించపరుస్తూ, మరోపక్క ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత గురించి అమెరికా ఎలా మాట్లాడుతుందని ఆయన ప్రశ్నించారు. దీనిపై ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క జాతీయుడికి వుందన్నారు.
ఆధునీకరణ అంటే పాశ్చాత్యీకరణ కాదు
ఆధునీకరణ అంటే పాశ్చాత్యీకరణ అనే భ్రమను తొలగిస్తామని చెప్పారు. ఈనాడు మానవ వికాస రంగం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళకు చైనా అనుసరించే ఆధునీకరణ విధానం అనేక పరిష్కారాలను చూపుతుందని చెప్పారు. 140కోట్ల మంది జనాభా కలిగిన దేశం ఆధునీకరణ సాధించడమంటే మానవ చరిత్రలోనే అదొక అద్భుతమైన కసరత్తు అని వ్యాఖ్యానించారు. చైనా విదేశాంగ విధానం, విదేశీ సంబంధాల గురించి ఆయన సవివరంగా మాట్లాడారు. చైనా ఆధునీకరణలో ఐదు అంశాలు వుంటాయని,అవి స్వేచ్ఛ, ప్రజలకు ప్రాధాన్యతనివ్వడం, శాంతియుత అభివృద్ధి, పారదర్శకత, అందరినీ కలుపుకుని పోవడం, సమైక్యతతో కష్టించి పనిచేయడమని చెప్పారు.