Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బూడిద, పొగతో కమ్ముకుపోయిన సమీప గ్రామాలు
జకార్తా: ఇండోనేషియాలో జావా దీవికి సమీపంలోని మెరపి అగ్నిపర్వతం బద్దలైంది. పర్వతానికి పగుళ్లు పడిన ప్రాంతానికి సమీప గ్రామాలన్నీ అగ్నిపర్వతం నుండి పెద్ద ఎత్తున వస్తున్న బూడిద, పొగతో కమ్ముకుపోయాయి. దీంతో దేశంలోనే అత్యంత క్రియాశీలంగా వుండే అగ్నిపర్వతం ఏటవాలుల్లో పర్యాటకం, మైనింగ్ కార్యకలాపాలను అధికారులు నిలిపివేయాల్సి వచ్చింది. ఇండోనేషియాలోని యోగ్యకర్తా ప్రత్యేక ప్రాంతంలో వున్న ఈ అగ్నిపర్వతం శనివారం మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో బద్దలైంది. దీంతో పెద్ద ఎత్తున వేడిగాలులు, పొగ, బూడిద వెలువడ్డాయి. దానికి తోడు రాళ్ళురప్పలతో కూడిన లావా ఏటవాలుగా ఏడు కిలోమీటర్ల వరకు దిగువకు ప్రవహించింది. వేడి బూడిద మేఘాలు గాల్లో వంద మీటర్ల ఎత్తు వరకు లేచాయని జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహరి తెలిపారు. అగ్నిపర్వతం నుండి వెలువడిన బూడిద మేఘాలతో రోజంతా సూర్యుడు కనబడకుండా పోయాడు. 8 గ్రామాలు తీవ్రంగా బూడిదతో ప్రభావితమయ్యాయని మెరపి అబ్జర్వేషన్ పోస్ట్ అధికారి ఒకరు తెలిపారు. బూడిదతో కప్పడిపోయిన ఇళ్ళు, రోడ్ల దృశ్యాలను స్థానిక టివి ప్రసారం చేసింది. 2963 మీటర్లు ఎత్తువుండే మెరపి అగ్నిపర్వతం దేశంలోనే అత్యంత క్రియాశీలంగా వుండే పర్వతాల్లో ఒకటి. 2010లో చివరిసారిగా బద్దలైనపుడు 300మందికి పైగా మరణించారు.