Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెర్లిన్ : రైళ్లు, విమాన, ప్రజారవాణాకు చెందిన పలు ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మె సోమవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైంది. ఈ సమ్మె వారాంతపు ప్రయాణాలకు అంతరాయం కలిగించింది. అన్ని రైళ్లు, విమానాలు, బస్సులు నిలిచిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రజారవాణా స్తంభించింది. ప్రభుత్వంతో యూనియన్లు జరుపుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని పలు ట్రేడ్ యూనియన్లు పేర్కొన్నాయి. దీంతో మూడో రౌండ్ చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. సమ్మెకు పిలుపునిచ్చినట్లు జర్మనీ అతిపెద్ద యూనియన్ వెర్డి తెలిపింది. బెర్లిన్ బ్రాండెన్‌బర్గ్ (బీఈఆర్) విమానాశ్రయం తప్ప దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలపై సమ్మె ప్రభావంపడింది. విమానాల రద్దు, ఆలస్యం కారణంగా సుమారు నాలుగు లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హబ్, ఫ్రాంక్ఫర్ట్ల్లో అన్ని విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని విమానాల షెడ్యూల్లో మార్పులు చేయబడ్డాయి. సమ్మె, దాని ప్రభావాలను ఊహించిన మ్యూనిచ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పటికే ఆదివారం విమానాలను నిలిపివేసింది. సోమవారం కూడా పలు విమానాలు రద్దయ్యాయి. సమ్మె కారణంగా ప్రధాన నౌకాశ్రయాలు, ఓడరేవుల వద్ద వాణిజ్య, ప్రయాణికుల రవాణా కూడా నిలిచిపోయింది.
అలాగే రైళ్ల నెట్వర్క్ కూడా స్తంభించిపోయింది. అన్ని రైళ్లను నిలిపివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జర్మనీలోని ఏడు ప్రధాన రాష్ట్రాలు బాడెన్, వుర్టమ్ బెర్గ్, హెస్సే, లోయర్ సాక్సోనీ, రైన్‌ల్యాండ్-పాలటినేట్, సాక్సోని, బవేరియా, నార్త్రైన్ -వెస్ట్ ఫాలియాల్లో ప్రజారవాణా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు ప్రభుత్వంతో ట్రేడ్ యూనియన్ల మూడో రౌండ్ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చలకు రెండు యూనియన్లు దూరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
''మనుగడకు సంబంధించిన అంశం'' : ట్రేడ్ యూనియన్లు
పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలను పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ సమ్మెను ''మనుగడకు సంబంధించిన అంశం '' అని జర్మనీలోని అతిపెద్ద యూనియన్ అభివర్ణించింది. దశాబ్దాల్లో జర్మనీలోనే అతిపెద్ద సమ్మెతో రవాణా రంగం తీవ్రంగా ప్రభావితమౌతుందని స్థానిక మీడియా తెలిపింది. తక్కువ వేతనం, ఎక్కువ పనిగంటలతో కార్మికులు అధిక ఒత్తిడి గురవుతున్నారని వెర్డి లేబర్ యూనియన్ అధ్యక్షుడు ఫ్రాంక్ వెర్నెక్ తెలిపారు. జర్మనీ వినియోగదారుల ధరల సూచీ ఫిబ్రవరిలో ఊహించిన దానికన్నా 9.3 శాతం పెరిగింది. వేతనాల పెరుగుదల లేకపోవడంతో ఈ సమ్మె మనుగడకు సంబంధించిన విషయంగా పేర్కొన్నారు.