Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టొరంటో : కెనడాలో మరోసారి మహాత్మునికి అవమానం జరిగింది. బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని యూనివర్శిటీ కేంపస్‌లో తాజాగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ప్రపంచ శాంతి దూతగా పిలుచుకునే మహాత్ముడి విగ్రహాన్ని ఖలిస్తాన్ మద్దతుదారులు ఇలా ధ్వంసం చేయడం రోజుల వ్యవధిలోనే రెండోసారి. సైమన్ ఫ్రాజర్ యూనివర్శిటీలో బుర్నాబై కేంపస్‌లో పీస్ స్క్వేర్ వద్ద వున్న మహాత్ముని విగ్రహాన్ని తాజాగా ధ్వంసం చేసినట్లు వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ జనరల్ మంగళవారం తెలిపింది. శాంతి దూత విగ్రహాన్ని ధ్వంసం చేసిన హేయమైన నేరాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాన్సులేట్ ట్వీట్ చేసింది. తక్షణమే ఈ విషయమై దర్యాప్తు జరిపి, దోషులను కఠినంగా శిక్షించాల్సిందిగా కెనడా అధికారులను కోరినట్లు ఆ ట్వీట్ తెలిపింది. ఈ నెల 23న ఓంటారియో ప్రావిన్స్‌లోని హమిల్టన్ పట్టణంలో గల సిటీ హాల్‌కి సమీపంలోని మహాత్ముని విగ్రహాన్ని ఖలిస్తాన్ మద్దతుదారులు ధ్వంసం చేశారు. గతేడాది జులైలో రిచ్మండ్ హాల్లోని విష్ణు ఆలయంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని విధ్వంసం చేయడంపై భారత కాన్సులేట్ జనరల్ నుండి తీవ్ర విమర్శలు, ఖండనలు వచ్చాయి. నేరపూరితమైన, విద్వేషంతో కూడిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ దీనివల్ల కెనడాలోని భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ సమయంలో కాన్సులేట్ జనరల్ ట్వీట్ చేసింది.ఇటీవల కాలంలో కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారులు భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. కొన్ని హిందూ ఆలయాలను కూడా ధ్వంసం చేశారు. ఫిబ్రవరి 13న మిస్సిసాగాలోని రామ మందిరాన్ని ఖలిస్తానీ తీవ్రవాదులు అపవిత్రం చేవారు. దీన్ని కూడా ఇండియన్ కాన్సులేట్ తీవ్రంగా ఖండించింది.