Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెన్షన్ సంస్కరణలపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం
- దిక్కుతోచని స్థితిలో మాక్రాన్
పారిస్ : పెన్షన్ సంస్కరణలపై ఫ్రాన్స్ అంతటా వరుసగా పదకొండవ రోజున నిరసనలు హోరెత్తాయి.. పదవీ విరమణ వయస్సును 62 నుండి 64కి పెంచుతూ అధ్యక్షుడు మాక్రాన్ ఏకపక్షంగా అమలు చేయబూనుకున్న పింఛను సంస్కరణలను 85 శాతానికిపైగా ఫ్రెంచి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అప్రతిష్టాకరమైన ఈ సంస్కరణలను వెనక్కి తీసుకోకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. మంగళవారం నాలుగు లక్షలమంది నిరసనల్లో పాల్గొనగా, బుధవారం నాటికొచ్చేసరికి రెట్టింపు సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. మాక్రాన్ ప్రభుత్వం నిర్బంధాన్ని ఎంతగా ప్రయోగించినా లెక్క చేయకుండా జనం పెద్దయెత్తున కదులుతున్నారు. దీంతో కొన్ని చోట్ల ప్రదర్శకులకు, పోలీసుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. పార్లమెంటు సభ్యుల ఓటింగ్‌తో నిమిత్తం లేకుండా సంస్కరణలను దూకుడుగా తీసుకురావడానికి అధ్యక్షుడు మాక్రాన్ ఈ నెల ప్రారంభంలో తన ప్రత్యేక రాజ్యాంగాధికారాన్ని ఉపయోగించారు. ఈ నిరంకుశ చర్యపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పారిశుధ్య కార్మికులు కూడా సమ్మెలోకి దిగడంతో పారిస్ వీధుల్లో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయింది. రైల్వే ట్రాకులన్నీ ఆందోళన జరుపుతున్న కార్మికులతో కిక్కిరిసిపోయాయి. విధులను బహిష్కరించి, వీధుల్లోకి రావాలనికార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. పారిస్, ఇతర ప్రధాన నగరాల్లో జరుగుతున్న ఆందోళనలపై ప్రధానంగా అందరూ దృష్టి కేంద్రీకరిస్తున్నా, దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలు, నగరాల్లో ప్రజల ప్రాతినిధ్యం కూడా చాలా ఎక్కువగానే వుంది. లోయిరే రీజియన్‌లోని మోంటార్గిస్లో దాదాపు 2వేల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ నిరసన తెలియచేశారు. మొత్తం జనాభాలో ఐదవ వంతు మంది రోడ్లపైనే వున్నారు. తనకు గుర్తున్నంతవరకు ఇదే అతిపెద్ద నిరసన ప్రదర్శన అని పాట్రిక్ అనే ఆందోళనకారుడు వ్యాఖ్యానించారు.
చర్చలు జరుపుతాం
వచ్చే మూడు వారాల్లో పార్లమెంట్ సభ్యులతోను, కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతామని ప్రధాని ఎలిజబెత్ బార్నె ప్రతిపాదించారు. దీనిపై సిజిటి ప్రధాన కార్యదర్శి ఫిలిప్ మార్టినెజ్ స్పందిస్తూ, సంక్షోభాన్ని పరిష్కరించడానికి ముందుగా సంస్కరణలను రద్దు చేసి, ఆ తర్వాత మధ్యవర్తిని నియమించాలని అన్నారు. ఫ్రెంచ్ పింఛను సంస్కరణల అమలుకు జారీ చేసిన ఉత్తర్వులను పక్కన పెడితేనే చర్చలకు అంగీకరిస్తామని యూనియన్లు తేల్చి చెప్పాయి. కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఫాబియెన్ రౌజెల్ మాట్లాడుతూ, కార్మిక సంఘాలతో చర్చలకు తలుపులు తెరిచే వున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సంస్కరణలను నిలుపుచేసి, సంక్షోభం నుండి బయటపడేందుకు ఒక మార్గాన్ని కనుగొనేందుకు కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ఆయన అధ్యక్షుడు మాక్రాన్‌ను కోరారు.
''కర్రలతో ఫ్రాన్స్‌ను పాలించలేరు. ఇదంతా పిచ్చితనం'' అని సెనెటర్, వామపక్ష సంస్థ అన్సబ్మిస్సివ్ ఫ్రాన్స్ నేత అయిన జేన్ లక్ మెలెంకన్ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌ను, ఫ్రెంచి ప్రజలను దెబ్బతీయాలని మాక్రాన్ చూస్తున్నారని, కానీ, మేం ఆయనకు దీటైన జవాబిస్తామని
ఆయన అన్నారు.