Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడల్లో రష్యా క్రీడాకారుల వ్యతిరేక ప్రభుత్వాలపై ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్
లసానె (స్విట్జర్లాండ్) : ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన 70 యుద్ధాలు, సాయుధ బలగాల ఘర్షణపై నోరుమెదని ప్రభుత్వాలు.. ఇప్పుడు రష్యా క్రీడాకారుల పట్ల ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం కారణంగా గత ఏడాదిగా ఒలింపిక్ క్రీడల్లో రష్యా క్రీడాకారులు తమ దేశానికి ప్రాతినిథ్యం వహించే హక్కు కోల్పోయారు. ఐఓసీ, లేదా సంబంధిత క్రీడల్లో అంతర్జాతీయ సమాఖ్య జెండా తరఫున రష్యా అథ్లెట్లు పోటీపడుతున్నారు. రష్యా, బెలారస్ క్రీడాకారులను అనుమతించే విషయంలో పలు కీలక సిఫారసులు చేస్తూ అంతర్జాతీయ క్రీడా ఫెడరేషన్లకు ఐఓసీ లేఖ రాసింది. ఓ వైపు యుద్ధం కొనసాగుతుండగా రష్యా క్రీడాకారులపై నిషేధం ఎత్తివేయటంపై ఉక్రెయిన్, పొలాండ్, చెక్ రిపబ్లిక్ ప్రభుత్వాలు ఐఓసీ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ విమర్శలను తిప్పికొడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'క్రీడల్లో, ఒలింపిక్ సర్క్యూట్లో మెజారిటీ అభిప్రాయాన్ని, క్రీడల స్వతంత్య్రాన్ని కొన్ని ప్రభుత్వాలు గౌరవించాలని అనుకోవటం లేదు. ఇది తీవ్రంగా ఖండించాల్సిన అంశం. ఇదే సమయంలో ద్వంద్వ ప్రమాణాలపై వివరణ ఇచ్చేందుకు సిద్దంగా లేవు.
ప్రపంచ వ్యాప్తంగా 70 యుద్ధాలు, సాయుధ బలగాల ఘర్షణ జరిగిన దేశాలకు చెందిన క్రీడాకారులపై పాటించాల్సిన ప్రమాణాలపై ఇప్పటి వరకు నోరు మెదపలేదు. ప్రభుత్వాల భాగస్వామ్యం ఒలింపిక్ మూవ్మెంట్ ఐక్యతను బలోపేతం చేసింది. కానీ ఏ క్రీడల్లో ఏ క్రీడాకారులు పోటీపడాలనే విషయాన్ని ప్రభుత్వాలు నిర్ణయించలేవు. రష్యా, బెలారస్ క్రీడాకారుల మానవ హక్కులను దృష్టిలో ఉంచుకునే వారి ప్రాతినిథ్యంపై తాజా మార్గదర్శకాలు జారీ చేశామని' థామస్ బాచ్ తెలిపారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రష్యా, బెలారస్ అథ్లెట్ల అధికార ప్రాతినిథ్యంపై ఐఓసీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతా నికి ఒలింపిక్ క్రీడల్లో అంతర్జాతీయ టోర్నీమెంట్లలో పాల్గొనేందుకు రష్యా, బెలారస్ అథ్లెట్లను అనుమతించాలని ఐఓసీ నిర్ణయం తీసుకుంది.