Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోర్న్ స్టార్‌తో ఒప్పందంపై కోర్టు అభిశంసన
- వచ్చే వారం లొంగిపోనున్న ట్రంప్ ?
- వ్యాఖ్యకు తిరస్కరించిన వైట్‌హౌస్
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్రతిష్టపాలయ్యారు. నేరం చేసి అది బయటకు రానివ్వకుండా చేసేందుకు ఆ నేర భాగస్వామితో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలు రుజువవడంతో మన్హటన్ గ్రాండ్ జ్యూరీ ట్రంప్‌ను అభిశంసించిది. దీంతో నేరారోపణలు ఎదుర్కొంటున్న మొదటి మాజీ అధ్యక్షుడిగా ఆయన అపఖ్యాతి మూటగట్టుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలన్న ట్రంప్ ప్రయత్నాలకు తాజా చర్యలతో ఎదురు దెబ్బ తగిలినట్లైంది. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో తనతో వివాహేతర సంబంధం వుందంటూ ఆరోపణలు చేసిన పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్కి ఆ విషయం బయటకు రానివ్వకుండా డబ్బులిచ్చి నోరు మూయించారన్న ఆరోపణలు రుజువవడంతో గ్రాండ్ జ్యూరీ ఆయనపై అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలో ఆయన న్యాయస్థానంలో లొంగిపోక తప్పదని భావిస్తున్నారు. అయితే అది ఎలా జరుగుతుందనే దానిపైనే ప్రస్తుతం అందరి దృష్టి వుంది. మన్హటన్ జిల్లా అటార్నీ ఇప్పటికే ట్రంప్ లీగల్ బృందంతో చర్చలు జరిపారు. ఒకవేళ ట్రంప్ మన్హటన్ కోర్టులో లొంగిపోయినట్లైతే, ఆయనను సుప్రీంకోర్టులో హాజరుపరిచేందుకు అవకాశాలు వున్నాయి. కాగా, తానే తప్పు చేయలేదంటూ ఇప్పటివరకు పదే పదే తిరస్కరిస్తూ వచ్చిన ట్రంప్ తాజాగా తనపై వచ్చిన ఈ అభిశంసనను కూడా రాజకీయ వేధింపులుగానే అభివర్ణిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యున్నత స్థాయిలో ఎన్నికల జోక్యంగా దీన్ని వ్యాఖ్యానించారు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా తనను అరెస్టు చేయడానికి అవకాశాలు వున్నాయంటూ ట్రంప్ ఇటీవల అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా ట్రంప్ ఎలాంటి నేరం చేయలేదని, కోర్టులో దీన్ని తప్పక సవాలు చేస్తామని డిఫెన్స్ లాయర్లు చెప్పారు. కాగా ట్రంప్ అభిశంసనను మన్హటన్ జిల్లా అటార్నీ కార్యాలయ ప్రతినిధి ధృవీకరించారు. ట్రంప్ లొంగిపోయేలా చూసేందుకు ప్రాసిక్యూటర్లు డిఫెన్స్ బృందాన్ని సంపద్రిస్తున్నారని ఆయన తెలిపారు. బహుశా వచ్చే వారం ట్రంప్ మన్హటన్ జిల్లా అటార్నీ కార్యాలయంలో లొంగిపోవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ట్రంప్ తరపు న్యాయవాది జో తకొపైనా మీడియాకు చెప్పారు. ప్రస్తుతం ట్రంప్ తన బృందంతో దీనిపై చర్చిస్తున్నారన్నారు. భద్రతా కారణాల రీత్యా ఆయన ఎలా వస్తారు, ఏర్పాట్లు ఏమిటనే విషయాలను ట్రంప్ లీగల్ బృందం చూసుకోనుంది. ఈ కేసులో ట్రంప్ దోషిగా తేలినప్పటికీ వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయడానికి ఆయన అనర్హుడు కాబోరు. గతేడాది నవంబరులోనే ట్రంప్ తన అభ్యర్ధిత్వ పత్రాలను దాఖలు చేశారు. కాగా, ట్రంప్‌పై వచ్చిన అనూహ్యమైన అభియోగాలపై వ్యాఖ్యానించడానికి వైట్‌హౌస్ తిరస్కరించింది.