Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా యుద్ధ నేరాల ను బయటపెట్టిన జూలియన్ అసాంజేని అమెరికా తరలించి, శిక్షించదలచిన అమెరికా ప్రయత్నానికి తమ లేబర్ ప్రభుత్వం మద్దతు నిస్తున్నట్టు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ ప్రకటించింది. ఆవిధంగా తమ దేశ పౌరుడిని రక్షించటానికి తమకు ఏ మాత్రం ఆసక్తిలేదని వాంగ్ చెప్పకనే చెప్పిన ట్టయింది. ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా, చైనాకు వ్యతిరేకంగా అమెరికా పన్నుతున్న వ్యూహంలో భాగమైంది. అమెరికాలోని శాన్ డియాగోలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆస్ట్రేలియా ప్రధాని ఆంతోనీ అల్బనీస్, బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ గత నెలలో సమావేశమై ఆస్ట్రేలియా 368 బిలియన్ డాలర్ల విలువగల అణుశక్తితో నడిచే జలాంతర్గాములను సమకూర్చుకుంటుందని ప్రకటించారు. ఇది ఆకస్ అనే చైనా వ్యతిరేక త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా జరిగింది.
వికీలీక్స్ సంస్థ వ్యవస్థాపకుడైన అసాంజేపై అమెరికా చేస్తున్న దాడి పట్ల ఆస్ట్రేలియా మౌనంగా ఉండటం ఆ దేశ లేబర్ ప్రభుత్వ దివాళాకోరు విధానాన్ని ప్రతిబింబిస్తోంది. ఈవిషయంపై నిలదీసినప్పుడు ''గొడవలేని దౌత్యనీతి''ని ఉపయోగిస్తున్నామని అల్బనీస్ ప్రభుత్వం బుకాయిస్తుంది. ఇప్పటికే అస్సాంజే కేసు ఎన్నో ఏండ్లుగా కొనసాగుతోందని, దాన్ని ఒక కొలిక్కి తేవలసిన అవసరం ఉందని వాంగ్ అభిప్రాయ పడింది. 'ఒక కొలిక్కి తీసుకురావటం' అంటే చాలా అర్థాలు ఉంటాయి. డాక్టర్లు అస్సాంజే ఆరోగ్యం వేగంగా క్షీణిస్తున్నదని ఎప్పుడో ప్రకటించారు. అలా అనారోగ్యంతో ఆయన బ్రిటన్లో అత్యంత భద్రతగల బెల్మార్ష్ జైలులో మరణించవచ్చు. లేక అయనను అమెరికాకు బలవంతంగా తరలించి రహస్య విచారణ పేరుతో 175సంవత్సరాల జైలు శిక్షను విధించవచ్చు. ఇలా అస్సాంజేను 'చట్టబద్దం'గా తొక్కిచంపటాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం సమర్థిస్తోంది. వాస్తవంలో చట్టాన్ని, న్యాయాన్ని పట్టించుకోకుండా అస్సాంజేని బలిపశువుని చేశారు. లండన్లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో అస్సాంజే అంతర్జాతీయంగా గుర్తించబడిన రాజకీయ కాందిశీకుడిగా ఉన్నప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో సీిఐఏ అతనిని అపహరించి హత్య చేయాలనే ప్రయత్నం జరిగింది. ఇదంతా ఎలా చట్టపాలన అవుతుందో వాంగ్ కే తెలియాలి.