Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎంఎఫ్ వెల్లడి
న్యూయార్క్ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మూడు శాతం కన్నా తక్కువే వృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా తెలిపారు. దీనివల్ల ఆకలి, దారిద్య్రం ముప్పు పెరుగుతుందని హెచ్చరించారు. గతేడాది ఈ వృద్ధిరేటు 3.4 శాతంగా వుటుందని అంచనా వేశారు. వచ్చే ఐదేళ్ళ పాటు వృద్ధిరేటు దాదాపు మూడు శాతంగానే వుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. 1990 నుండి ఇప్పటివరకు ఇదే అత్యంత తక్కువైన మధ్యకాలిక వృద్ధి అంచనాగా ఆమె పేర్కొన్నారు. తక్కువ ఆదాయం కలిగిన దేశాలను ఈ పరిస్థితి తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ''కోవిడ్ సంక్షోభం వల్ల ప్రారంభమైన ప్రమాదకరమైన ధోరణి దారిద్య్రం, ఆకలి మరింత పెచ్చరిల్లుతాయి.'' అని క్రిస్టలినా పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న తీవ్రమైన అంశాలపై చర్చించేందుకు వచ్చే వారం ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశమవుతున్న నేపథ్యంలో క్రిస్టలినా వ్యాఖ్యలు వెలువడ్డాయి.
అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వుండేలా అన్ని దేశాల సెంట్రల్ బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచడం, వర్ధమాన దేశాల్లో కొనసాగుతున్న రుణ సంక్షోభంతో రుణా భారాలు మరింత పెరిగి దేశాల అభివృద్ధి దెబ్బతింటోన్న తరుణంలో ఈ వార్షిక సమావేశాలు జరుగుతున్నాయి. పెరుగుతున్న రుణ వ్యయం, మరోవైపు తమ ఎగుమతులకు తగ్గుతున్న డిమాండ్ ఇలా రెండు రకాలుగా తక్కువ ఆదాయ దేశాలు దెబ్బతింటాయని భావిస్తున్నారు. ఫలితంగా ఆకలి, దారిద్య్రం పెచ్చరిల్లుతుందని హెచ్చరించారు. ఇప్పటికే 15 శాతం తక్కువ ఆదాయ దేశాలు రుణ ఉచ్చులో ఇరుకున్నాయి. అదనంగా 45 శాతం దేశాలు దానికి సమీపంగా వస్తున్నాయని అన్నారు. ఇటువంటి తరుణంలో సంపన్న ఐఎంఎఫ్ సభ్య దేశాలు మరింతగా తోడ్పాటునందించాల్సి వుందన్నారు.