Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలెం : ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌పై వైమానిక దాడికి దిగింది. ప్రస్తుతం లెబనాన్‌పై దాడి చేపడుతున్నట్లు ఇజ్రాయిల్ సైన్యం శుక్రవారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ ఓడరేవు నగరమైన టైర్‌లోని శరణార్థి శిబిరం సమీపంలో పేలుళ్లు జరిగినట్లు లెబనాన్ మీడియా కూడా ధ్రువీకరించింది. గురువారం అర్ధరాత్రి పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. లెబనాన్ నుంచి హమాస్ తీవ్రవాదులు తమ దేశంపై రాకెట్లతో దాడులకు పాల్పడంతోనే తాము వైమానిక దాడులు చేసినట్లు తెలిపింది. జెరూసలెంలోని అల్-అక్సా మసీదులో పాలస్తీయన్లపై ఇజ్రాయెల్ పోలీసులు రబ్బరు పూత పూసిన ఇనుప బుల్లెట్లు, గ్రెనేడ్లతో దాడికి దిగన సంగతి తెలిసిందే. అనంతరం ఈ దాడులు జరగడం గమనార్హం. లెబనాన్ భూభాగం నుంచి 34 రాకెట్లతో తమ దేశంపైకి దాడికి పాల్పడినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అయితే వాటిలో 25 రాకెట్లను తమ రక్షణ వ్యవస్థ అడ్డుకుందని, మరో ఐదు ఇజ్రాయెల్ భూభాగంలో పడినట్లు పేర్కొంది. హమాస్ చర్యకు ప్రతిస్పందనగా వారికి చెందిన రెండు సొరంగాలు, రెండు ఆయుధ తయారీ స్థలాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. లెబనాన్ చర్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మాట్లాడుతూ.. బాధ్యులు తగిన మూల్యం చెల్లించుకుంటారని ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే గాజా స్ట్రిప్‌పై దాడులు జరగడం గమనార్హం. అయితే లెబనాన్ లేదా గాజాలో ప్రాణనష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదు.కాగా ఇజ్రాయల్ వ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్న నేపధ్యంలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయిలీల ఆవాసాలకు సమీపంలో జరిగిన పాలస్తీనా జాతీయుని కాల్పుల్లో ఇద్దరు మహిళలు మరణించారు.
మరొకరు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ వైద్యులు ప్రకటించారు. వెస్ట్ బ్యాంక్‌లో వారాల తరబడి అసాధారణంగా నెలకొన్న అశాంతి, ఉద్రిక్తతల తర్వాత జరిగిన ఈ దాడితో జెరూసలేంలోని ఉద్రిక్తతలు ఆక్రమిత భూభాగానికి కూడా పాకినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ ఉత్తర, దక్షిణాది సరిహద్దుల్లో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నా లెబనాన్‌పై తెల్లవారు జామున ఇజ్రాయిల్ దాడులతో ఘర్షణలు కొత్త దశకు చేరుకున్నాయని భయపడుతున్నారు. గురువారం లెబనాన్ నుండి వరుసగా వచ్చిన రాకెట్ల దాడికి ప్రతిగా ఈ దాడులు జరిగాయని భావిస్తున్నారు. జెరూసలేంలోని అల్ అక్సా మసీదు వద్ద ఇజ్రాయిల్ పోలీసుల దాడులతో అరబ్ ప్రపంచం వ్యాప్తంగా ఆగ్రహాలు వ్యక్తమయ్యాయి.