Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహిర్గతమైన డాక్యుమెంట్లు చెబుతున్న సత్యం
నెల్లూరు నరసింహారావు
ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధంలో అమెరికా ప్రమేయం గురించి ఆ దేశ రక్షణ శాఖ పెంట గాన్, అమెరికా గూఢచార సంస్థలకు చెందిన అనేక రహస్య డాక్యుమెంట్లు లీకయ్యాయి. అలా బహిర్గతమైన డాక్యుమెంట్లు సోషల్ మీడియా వేదికలపైన విస్తృతంగా వైరల్ అయ్యాయి. వారాంతానికల్లా ఈ డాక్యు మెంట్లు అసలైనవేనని అమెరికా అధికారుల స్పందనలతో తేలి పోయింది. ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం శ్రుతిని, గతిని నిర్ణయించే శక్తులు అమెరికా, నాటో దేశాలేనని, ఉక్రెయిన్ సైన్యం నిర్వహించే పాత్ర అమెరికా, దాని మిత్రదేశాల ఆదేశాలను అనుసరించే ఉంటున్నదనే వాస్తవాన్ని ఈ డాక్యుమెంట్లు వెల్లడించాయి.
నాటో కూటమి దేశాల నుంచి 150మంది సైనిక అధికారులు ఉక్రెయిన్లో తిష్టవేసి నిధులు, ఆయుధ సరఫరా, మిలిటరీ శిక్షణ వంటి విషయాలను పర్యవేక్షిస్తూ ఉక్రెయిన్ సైన్యాన్ని ప్రత్యక్షంగా కమాండ్ చేస్తు న్నారు. ఉక్రెయిన్ రాజకీయ వ్యవస్థను తమకు అనుకూలంగా మలుచు కుని, వేలాది ఉక్రెయిన్లను, రష్యన్లను బలిగొంటున్న వినాశకర యుద్ధంలో ఉక్రెయిన్ ప్రజలను మందుగుండుగా మార్చటానికి అమెరికా, దాని మిత్ర నాటో దేశాలు అపారమైన నిధులను వ్యయం చేస్తున్నాయి. వేరేమాటల్లో చెప్పాలంటే ఉక్రెయిన్ యుద్ధం గురించి అమెరికా, నాటో దేశాలు వండి వారుస్తున్న కథనాలు పచ్చి బూటకాలని ఈ డాక్యుమెంట్లు తేటతెల్లం చేస్తున్నాయి. 2022 మే నెలలో అమెరికా అధ్యక్ష భవన అధికార ప్రతినిధి, జెన్ సాకీని ''ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం నాటో కనుసన్నల్లో(ప్రోక్సీ) నడుస్తున్న యుద్ధమా?'' అని అడిగినప్పుడు ఆమె ఇలా సమాధానం చెప్పింది: ''అలా మాట్లాడుతున్నది రష్యా అని నాకు తెలుసు. కానీ ఇది నాటో చేయిస్తున్న యుద్ధం కానేకాదు... రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగు తున్న ఈ యుద్ధంలో నాటోకు ఎటువంటి ప్రమేయం లేదు''. ఈ ప్రకటన ఎంత బూటకమో లీకయిన డాక్యుమెంట్లు సవివరంగా వెల్లడించాయి. అమెరికా సామ్రాజ్యవాద ప్రచార వ్యవస్థ పాత్రను పశ్చిమ దేశాల మీడియా పోషిస్తున్నది. ఇరాక్ యుద్ధ కాలాన్ని తలపిస్తూ అమెరికా మీడియా అభూతకల్పనలను వార్తలుగా ప్రజల ముందుంచుతున్నది. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా, నాటో దేశాల పాత్రను గురించి ఈ డాక్యుమెంట్లు వెల్లడిస్తున్న విషయాలు ఇలా ఉన్నాయి:
- ఉక్రెయిన్లో 97 నాటో ప్రత్యేక దళాలు పనిచేస్తున్నాయి.
- 100మంది అమెరికన్లు(వీరిలో 71మంది అమెరికా సైన్యానికి చెందినవారు) ఉక్రెయిన్లో కీలకంగా పనిచేస్తున్నారు.
- అమెరికా సైన్యం ఉక్రెయిన్ మిలిటరీకి శిక్షణ ఇవ్వటమే కాకుండా ఉక్రెయిన్లో నాటో, అమెరికా దళాల చలనాలను నిర్దేశిస్తోంది.
- మేనెల మధ్యలో క్రైమియాను రష్యా నుంచి వేరు చేయటానికి ఉక్రెయిన్ పేరుతో పెద్ద ఎత్తున చేయనున్న దాడికి కావలసిన వ్యూహ రచనకు సంబంధించిన సవివరమైన మ్యాపులను అమెరికా తయారు చేస్తోంది.
- వసంత కాలంలో అలా జరగనున్న దాడికి కావలసిన నిధులు, సైనిక శిక్షణ, ఆయుధ సరఫరా వంటి విషయాలను అమెరికా, దాని నాటో మిత్ర దేశాలు చూసుకుంటున్నాయి. ఈ దాడి కోసం 12 సుశిక్షిత బ్రిగేడ్ల సైన్యాన్ని తయారు చేస్తున్నారు. వీటిలో ఉక్రెయిన్ తయారు చేసే మూడు అంతర్జాతీయ బ్రిగేడ్లు, అమెరికా, దాని మిత్ర దేశాలు శిక్షణ ఇచ్చి సాయుధం చేసిన తొమ్మిది బ్రిగేడ్లు ఉంటాయి.
ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోయిన రష్యా సైనికుల సంఖ్యను గురించి బయటకు చెప్పేది ఒకటి, లోపల ఉన్నది మరొకటిగా ఉంది. ఫిబ్రవరి 2వ తేదీనాటి నూయార్క్ టైమ్స్ అధికార వర్గాలను ఉటంకిస్తూ ప్రచురించిన కథనం ప్రకారం యుద్ధంలో చనిపోయిన రష్యన్ సైనికుల సంఖ్య దాదాపు రెండు లక్షలు. ఇందుకు భిన్నంగా ఇదే సంఖ్య అంతర్గత డాక్యుమెంట్లను అనుసరించి 35 నుంచి 43 వేల మధ్యలో ఉంది.
ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా, నాటో దళాలు పాల్గొంటున్నాయని ఈ డాక్యుమెంట్లు వెల్లడిస్తున్న వాస్తవాన్ని పశ్చిమ దేశాల మీడియా తక్కువచేసి చూపిస్తోంది. ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా ఈ డాక్యుమెంట్లను బహిర్గతం చేసింది ఎవరనే విషయంపైన ద్రుష్టిని కేంద్రీకరిస్తోంది. బైడెన్ పాలన చట్టవిరుద్దంగా చేస్తున్న అప్రకటిత యుద్ధాన్ని, అంతులేని అబద్దాలను వెల్లడిస్తున్న డాక్యుమెంట్లను ప్రచురించటానికి కూడా అమెరికన్ మీడియా సిద్దపడకుండా స్వీయనియంత్రణను పాటిస్తోంది. ఈ డాక్యుమెంట్లలో వెల్లడైనట్టు క్రైమియాపైన జరగనున్న దాడిలో గనుక అమెరికా, దాని మిత్ర దేశాలు పాల్గొనటం జరిగితే అది ఉక్రెయిన్ వినాశనానికి దారితీస్తుంది. అంతేకాదు ప్రపంచాన్ని అణు యుద్ధం అంచున నిలబెడుతుంది.