Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గూగుల్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
- అమెరికా గూఢచారులకు అందించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలని ఆదేశం
సియోల్ : పౌరుల ప్రైవసీ పైన అమెరికా చట్టాల ఆధిపత్యం ఏమిటని గూగుల్‌ను దక్షిణకొరియా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గూగుల్ సేకరించి, అమెరికా గూఢచార సంస్థలకు అందించిన దక్షిణ కొరియా పౌరులకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలని దక్షిణ కొరియా సుప్రీం కోర్టు గూగుల్‌ను ఆదేశించింది. ఈ కేసు పైన కింద కోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ ఈ ఆదేశం అంతిమం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అమెరికా జాతీయ భద్రతా సంస్థకు దక్షిణ కొరియా పౌరుల ప్రయివేటు సమాచారాన్ని తన ప్రిజం ప్రోగ్రాం ద్వారా అందజేసిందనే అభియోగాన్ని గూగుల్ ఎదుర్కొంటున్నది. ఈ సమాచారంలో ఇంటర్నెట్లో సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి నేరుగా సేకరించిన ప్రయివేటు సంభాషణలు కూడా ఉన్నాయి. వినియోగదారుల వ్యక్తిగత ప్రైవేటు సమాచారాన్ని ఇతరులకు అందిం చటం గురించి వారు అడిగిన ప్రశ్నలకు సర్వీస్ ప్రొవైడర్స్ సమాధానం చెప్పాల ని దక్షిణ కొరియా చట్టం చెబుతున్నది. అయితే అమెరికా చట్టం పరిధిలో అదిలేదని గూగుల్‌కు తిరస్కరించే అధికారం ఉంటుందని గతంలో ఒక అప్పీల్ కోర్టు రూలింగ్ ఇచ్చింది. అయితే ఆ రూలింగ్‌ను సుప్రీంకోర్టు కొంతవరకు మార్చి అమెరికా చట్టాలు ఏమిచెబుతున్నప్పటికీ గూగుల్ పౌరులకు చెందిన సమాచారాన్ని ఎవరెవరికి అందించిందో చెప్పటం తప్పనిసరి అని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాన్ని జాగ్రత్తగా పరిశీలించి వినియోగదారుల ప్రయోజనాలు కాపాడతామని కొరియాలోని గూగుల్ ప్రకటించింది. అమెరికాలో పౌరులపైన ప్రభుత్వం పెద్ద ఎత్తున గూఢచర్యానికి పాల్పడుతోందని 2013లో ఎడ్వర్డ్ స్నోడెన్ వేలాది రహస్య పత్రాలను లీక్ చేసినప్పుడు మొట్టమొదటిసారిగా ప్రిజం ప్రోగ్రాం గురించి ప్రపంచానికి తెలిసింది. 2007లో జార్జి బుష్ కాలంలో మొదలయిన ఈ ప్రిజం ప్రోగ్రాం అమెరికా జాతీయ భద్రతా సంస్థకు ప్రధాన గూఢచర్య వనరుగా ఉండేదని లీకైన డాక్యుమెంట్స్ ద్వారా తెలుస్తున్నది. ఇది పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.