Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాతావరణ సంక్షోభ నివారణకు గుటెరస్ పిలుపు
ఐక్యరాజ్య సమితి : వాతావరణ సంక్షోభాన్ని నివారించడానికి ఆదివాసీల వద్ద అనేక పరిష్కారాలు వున్నాయని, వారి నుండి ప్రపంచం ఎంతో నేర్చుకోవాల్సి వుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ సోమవారం వ్యాఖ్యానించారు. ఆదివాసీల సమస్యలపై ఐక్యరాజ్య సమితి శాశ్వత వేదిక 22వ సమావేశాలను ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సవాళ్ళను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. మొత్తంగా ప్రపంచ జనాభాలో ఆదివాసీలు దాదాపు 5 శాతం మంది వుంటారు. కానీ ప్రపంచంలోని అత్యంత పేదల్లో 15 శాతం మంది వారిలోనే వున్నారని అన్నారు. వాతావరణానికి సంబంధించిన అత్యవసర పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారన్నారు. వాతావరణ సంక్షోభానికి వారు కారణం కాకపోయినా అత్యంత అధ్వాన్నమైన, తక్షణమే ప్రభావం చూపగల ప్రభావాలను వారు ఎదుర్కొంటున్నారని అన్నారు. ''ఐక్యరాజ్య సమితి ఆదివాసీలకు బాసటగా వుంటుంది.'' అన్నదే ఈనాటి తన సందేశమని గుటెరస్ స్పష్టం చేశారు. 2000లో ఐక్యరాజ్య సమితి శాశ్వత వేదిక ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలి(ఇసిఓఎస్ఓసి) ద్వారా ఐక్యరాజ్య సమితి వ్యవస్థకు ఆదివాసీల సమస్యలపై సూచనలు, సలహాలను ఈ ఫోరం అందచేస్తుంది. ఈ నెల 28వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ''ఆది వాసీలు, మానవ ఆరోగ్యం, భూగోళం, ప్రాదేశిక ఆరోగ్యం, వాతావరణ మార్పులు : హక్కుల ఆధారిత విధానం'' అన్న అంశం ప్రాతిపదికగా ఈ ఏడాది సమావేశాలు జరుగుతున్నాయి. ప్రకృతిని కాపాడేందుకు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు చేస్తున్న కృషిలో ఆదివాసీల అద్వితీయమైన పాత్రను గుటెరస్ ప్రశంసించారు.