Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢాకా : బంగ్లాదేశ్ 22వ అధ్యక్షుడుగా ప్రముఖ రాజకీయ నేత మహ్మద్ షహబుద్దీన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. చారిత్రక దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ షిరిన్ షర్మిన్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని షేక్ హసీనా, ఆమె మంత్రివర్గ సహచరులు, కొత్త అధ్యక్షుడి కుటుంబ సభ్యులు, రాజకీయ నేతలు, సుప్రీం న్యాయమూర్తులు, సీనియర్ సివిల్, మిలటరీ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆదివారంతో అబ్దుల్ హమీద్ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో షహబుద్దీన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాలక పార్టీ అవామీ లీగ్ అభ్యర్థిగా షహబుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం హహబుద్దీన్ సంబంధిత ప్రమాణ పత్రాలపై సంతకాలు చేశారు. దేశాధ్యక్షుడి పదవి అలంకార ప్రాయమే అయినప్పటికీ, సార్వత్రిక ఎన్నికల సమయంలో అధ్యక్ష కార్యాలయం పట్ల అందరి దృష్టి కేంద్రీకృతమై వుంటుంది. అధ్యక్షుడు, ప్రధానిని నియమించడంతోపాటు దేశ రాజ్యాంగ సంరక్షకుడిగా కూడా వ్యవహరిస్తారు. ఎన్నికల వ్యవస్థ పట్ల పాలక అవామీ లీగ్, ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ మధ్య అభిప్రాయ బేధాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబరులో లేదా వచ్చే ఏడాది జనవరిలో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దిగువ కోర్టు న్యాయమూర్తి అయిన షహబుద్దీన్ గత వారం మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ, ప్రజలందరూ తమ ఓటు హక్కు వినియోగించేలా ఓటర్లను ప్రోత్సహించేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజకీయ పరిస్థితులను సమీక్షించి, రాజకీయ పార్టీల మధ్య వివాదాలను తగ్గించడంలో తన పాత్ర వుంటుందా, లేదా అన్నది సమీక్షిస్తానని చెప్పారు.