Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనుషుల నదులు కొన్ని
ఒట్టి పోయిన ఊపిరి జలంతో
కనుమరుగవుతున్నాయి!
ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అందకుండా
కరోనా కర్కశత్వానికి దాసోహమంటూ
ఉసురు తీస్తున్న ప్రాణ వాయువు
స్మశానాల్లోని రగులుతున్న
చితి మంటలకు ఆజ్యమవుతోంది..
నేలమాళిగల్లో నిద్ర నటిస్తున్న
బాధ్యతల్ని చూసి
సంకెళ్ళు తెంచుకోలేని
హక్కులు తెలవెల బోతున్నవి!
స్వార్థం చేస్తున్న స్వైర విహారంలో
బాధితులంతా బలిపశువులవుతుంటే
జీవితేచ్ఛతో వచ్చిన ప్రదేశం
జీవశ్చవాల్ని చేస్తున్నది!
కొడిగడుతున్న బతుకు దీపాలకు
కొత్త చమురు నింపి
నిండు ప్రాణాలను
కాపాడాల్సిన మనిషి తనం
కమురు వాసనై భయపెడుతోంది!
కనిపించని శత్రువుతోనూ
కళ్ళ ముందు తిరుగుతున్న
మనసు లేని మనుష్యులతో
యుద్దమెలా చేయాలో తెలియక
దేహ బావుల్లో ఇంకి పోతున్న
ఆత్మ స్థైర్యం
ఈ సమరం ఆగేదెప్పుడో తెలియక
కాలం వంక బేలగా చూస్తోంది!
- వురిమళ్ల సునంద,
9441815722